సుజనాకు ఈడీ సమన్లు: చంద్రబాబుకు పెద్ద దెబ్బ

By narsimha lodeFirst Published Nov 24, 2018, 7:23 PM IST
Highlights

ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత వరుసగా టీడీపీ నేతలను లక్ష్యంగా ఆదాయ పన్ను, ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. 


అమరావతి:  ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత వరుసగా టీడీపీ నేతలను లక్ష్యంగా ఆదాయ పన్ను, ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చెందిన ముఖ్యనేతల  ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో రాజ్యాంగ సంస్థలను బీజేపీ ఉపయోగిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్  సమావేశాల సమావేశంలో  ఎన్డీఏ నుండి  టీడీపీ బయటకు వచ్చింది. కేంద్రంపై టీడీపీ అవిశ్వాసాన్ని పెట్టింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు,  ఆ పార్టీకి చెందిన  సానుభూతిపరుల సంస్థలపై   ఐటీ, ఈడీ అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  సోదాలు నిర్వహించారు.

ఈ సోదాలపై టీడీపీ నేతలు బీజేపీ తీరును తప్పుబట్టారు. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కేంద్రం తీరును తప్పుబట్టారు. రాజ్యాంగసంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని  విపక్షపార్టీలను భయపెట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని చంద్రబాబునాయుడు  బీజేపీ తీరును ఎండగట్టారు.

2014 ఎన్నికల సమయంలో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో  సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు. గుంటూరు జిల్లాతో పాటు  ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ వ్యవహరాల్లో కీలకంగా వ్యవహరించారు.అభ్యర్థుల ఎంపికతో పాటు  ఇతర విషయాల్లో సుజనా కీలకంగా వ్యవహరించారు.

ఆ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొంది.  కేంద్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో కేంద్రంలో టీడీపీ రెండు మంత్రి పదవులు తీసుకొంది. ఇందులో  సుజనా చౌదరితో పాటు ఆశోక్‌ గజపతిరాజుకు కూడ కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

2009 నుండి టీడీపీని  సంస్థాగతంగా నడిపించడంలో చంద్రబాబునాయుడు పనిచేస్తే.... పార్టీకి నిర్వహణకు అవసరమైన ఆర్థిక వ్యవహరాలను సుజనా, నామా, సీఎం రమేష్ లాంటి పారిశ్రామికవేత్తలు చూశారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఎన్డీఏతో టీడీపీ తెగదెంపులు చేసుకొన్న తర్వాత  టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన నేతలపైనే ఈడీ, ఐటీ అధికారుల సోదాలు సాగుతున్నాయి. ఈ పరిణామాలు టీడీపీ నేతల్లో ఒకింత భయాన్ని కలిగిస్తున్నాయి.

గత నెలలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో ఐటీ  అధికారులు సోదాలు నిర్వహించారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని సీఎం రమేష్ ఆరోపించారు.

రెండు రోజులుగా సుజనా చౌదరి కార్యాలయాల్లో  ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మూడు బ్యాంకుల ఫిర్యాదుతో  గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు సోదాలు నిర్వహించారు. సుమారు 5700 కోట్ల అవినీతి జరిగినట్టుగా  ఈడీ అధికారులు గుర్తించారు. 

ఏపీ సీఎం చంద్రబాబుకు సుజనా చౌదరి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు ఉంది. ఈ తరుణంలో సుజనా కంపెనీల్లో సోదాలు నిర్వహించడం రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకొంది.

సంబంధిత వార్తలు

రూ.6వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్: సుజనాచౌదరికి ఈడీ సమన్లు

టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఐటీ అధికారుల షాక్..

click me!