బొత్స వెనుక ఎవరున్నారు...?

By narsimha lodeFirst Published May 15, 2019, 5:21 PM IST
Highlights

పేదలకు  ఇళ్ల పట్టాలను మంజూరు చేయిస్తామని డబ్బులు వసూలు చేసిన  మాజీ సీపీఐ నేత బొత్స ప్రశాంత్‌ కుమార్ వెనుక ఎవరున్నారనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


విశాఖపట్టణం: పేదలకు  ఇళ్ల పట్టాలను మంజూరు చేయిస్తామని డబ్బులు వసూలు చేసిన  మాజీ సీపీఐ నేత బొత్స ప్రశాంత్‌ కుమార్ వెనుక ఎవరున్నారనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొత్స ప్రశాంత్ కుమార్ చాలా ఏళ్ల క్రితం విశాఖకు వలస వచ్చాడు. ఆ సమయంలోనే ఆయన సీపీఐలో సభ్యత్వం తీసుకొన్నాడు. సీపీఐలో క్రియాశీలకంగా ఎదిగాడు. సీపీఐ వన్‌టౌన్ కార్యదర్శిగా కూడ పనిచేశారు.

శైలజ అనే మహిళకు ఇళ్ల పట్టాలను ఇప్పిస్తామని చెప్పి రూ. 2 లక్షలను వసూలు చేశాడు. కానీ,ఆమెకు ఇళ్ల పట్టా దక్కలేదు. దీంతో బాధితురాలు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సర్వోదయ ఆశ్రమం పేరుతో బొత్స ప్రశాంత్ కుమార్ ప్రజల నుండి విరాళాలు పోగు చేసేవారని  పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పట్టణంలోని మురికివాడల్లో నివాసం ఉండేవారికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని ప్రశాంత్ కుమార్ డబ్బులు వసూలు చేశారు. సుమారు కోటికి పైగానే వసూలు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

జీవీఎంసీ కి చెందిన రశీదులు, స్టాంపులను కూడ తయారు చేయించారని అంటున్నారు. ఇళ్ల పట్టాల కోసం జీవీఎంసీతో పాటు పలువురికి డబ్బులను చెల్లించినట్టుగా  ప్రశాంత్ కుమార్ పోలీసులకు చెప్పారని సమాచారం. పోలీసులు, మీడియా, పార్టీలోకి కొందరు సభ్యులకు కూడ డబ్బులు చెల్లించినట్టుగా చెప్పారు. అయితే ఈ విషయమై ఎవరైనా నిలదీస్తే మాత్రం మరోకరి పేరును చెప్పారని సమాచారం.

బొత్స ప్రశాంత్ కుమార్ ను మంగళవారంనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కుమార్‌ను పార్టీ నుండి తొలగించినట్టుగా సీపీఐ విశాఖ నగర కార్యదర్శి పైడిరాజు ప్రకటించారు.

click me!