ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబు తరపున వాదనలు, ఎవరీ సిద్ధార్ధ్ లూథ్రా.. ఆయన ఫీజు ఎంత..?

Siva Kodati | Published : Sep 10, 2023 5:55 PM

చంద్రబాబు తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు.  దీంతో అసలు ఎవరీ సిద్ధార్ధ్ లూథ్రా, గతంలో ఏ కేసులు వాదించారు, చంద్రబాబు తరపున వాదించినందుకు గాను ఆయన ఎంత ఫీజు తీసుకున్నారంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌ను జల్లెడ పడుతున్నారు. 

Google News Follow Us

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నంద్యాలలో శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు. సిట్ కార్యాలయంలో గంటల పాటు ఆయనను విచారించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఢిల్లీ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. దీంతో అసలు ఎవరీ సిద్ధార్ధ్ లూథ్రా, గతంలో ఏ కేసులు వాదించారు, చంద్రబాబు తరపున వాదించినందుకు గాను ఆయన ఎంత ఫీజు తీసుకున్నారంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌ను జల్లెడ పడుతున్నారు. 

సిద్ధార్ధ్ లూథ్రా.. ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ చట్టాలు తదితర అంశాల్లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఎన్నో కీలకమైన కేసులు వాదించారు. వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలు వంటి వాటిలో వాదించిన అనుభవం ఆయన సొంతం. సిద్ధార్థ్ లూథ్రా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో క్రిమినాలజీలో ఎంఫిల్ చేశారు. ఢిల్లీ న్యాయ సేవల అథారిటీ సభ్యునిగా, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఉపాధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు. బ్రిటన్‌లోని నార్తుంబ్రియా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

ALso Read: చంద్రబాబు అరెస్ట్.. ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్.. తీవ్ర ఉత్కంఠ..

మూడు దశాబ్ధాలుగా లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న సిద్ధార్థ్ లూథ్రాకు 2007లో సీనియర్ అడ్వకేట్ హోదా లభించింది. 2010 నుంచి ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 2012 నుంచి 2014 వరకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా సేవలందించారు. దేశాన్ని కుదిపేసిన తెహల్కా కేసులో 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను విచారించారు. కేజ్రీవాల్‌పై దివంగత అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జైట్లీ తరపున వాదనలు వినిపించారు. 

ఇకపోతే.. సిద్ధార్ధ్ లూథ్రా కోర్టుకు రావడానికి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తారని సమాచారం. దీనికి ప్రయాణ ఖర్చులు, బస, ఇతర సదుపాయాలు అదనం. ఒక్కోసారి కేసు తీవ్రతను బట్టి రూ.15 లక్షల వరకు సిద్ధార్ధ్ లూథ్రా వసూలు చేస్తారని టాక్.