ఏపీలో మారుతున్న కాపు రాజకీయం: పార్టీలకతీతంగా ఒక్కటవుతున్న నేతలు, శాసించేది తామేనన్న గంటా

By Siva KodatiFirst Published Dec 31, 2021, 8:32 PM IST
Highlights

కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సరికొత్త నాందీ పడనుందా..? ఇటీవల కాపు నేతల వరుస భేటీలకు కారణం ఏంటీ..? సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటారా..? రాజ్యాధికారం కోసం పోరాడుతున్న కులాల పునరేకీకరణ జరుగుతుందా..? వీరితో కలిసొచ్చేది ఎవరు....? కలుపుకుని పోగలిగేది ఎవరు..? 

కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సరికొత్త నాందీ పడనుందా..? ఇటీవల కాపు నేతల వరుస భేటీలకు కారణం ఏంటీ..? సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటారా..? రాజ్యాధికారం కోసం పోరాడుతున్న కులాల పునరేకీకరణ జరుగుతుందా..? వీరితో కలిసొచ్చేది ఎవరు....? కలుపుకుని పోగలిగేది ఎవరు..? 

ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేందుకు బలమైన ప్రయత్నాలు మొదలయ్యాయి. రాజ్యాధికారమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకు ఉత్తరాంధ్ర నుంచే బీజం పడింది. ఈ ప్రయత్నాలకు కేంద్రంగా నిలిచారు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు. ఇటీవల విశాఖ జిల్లా పాయకరావుపేటలో రంగా విగ్రహావిష్కరణలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారి కులం కేపాసిటీ గురించి బహిరంగ వేదికపై చర్చించారు. అదీ రంగా జయంతి వేడుకల్లో కావడంతో కాక మొదలైంది. 

కాపు సామాజిక వర్గం భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ సభకు వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సభ తర్వాత మరో కీలక పరిణామాం జరిగింది. హైదరాబాద్‌లో వివిధ పార్టీల్లోని ముఖ్యమైన కాపు నేతుల సమావేశమయ్యారు. ఈ నెల 21న జరిగిన ఈ లంచ్ మీటింగ్‌కు హాజరైన వారంతా కీలకమైన వారు కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. 

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల్లో మార్పు దిశగా అనుసరించాల్సిన వ్యూహాంపై విస్తృతమైన చర్చ నడిచింది. సంక్రాంతికి ముందు విశాఖలో మరో విడత సమావేశమై భవిష్యత్ కార్యచరణను నిర్ణయించాలని తేల్చారు. ఈ సమావేశం కోసం అన్ని పార్టీల్లోని ముఖ్యులతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నికల నాటికే ఈ పరిణామాలు మొదలయ్యాయి. చాప కింద నీరులా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. 

బహిరంగంగా సభా వేదికపై పవన్ కల్యాణ్ కాపుల విషయాన్ని ప్రస్తావించారు. రాజ్యాధికారానికి దూరంగా వున్న అన్ని కులాలను కలుపుకుని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం వుందన్నారు. ఆ తర్వాత సీన్ విశాఖకు మారింది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెరపైకి వచ్చారు. చాలా కాలంగా వివిధ సంఘాలతో ఆయన భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన నాయకులు విశాఖకు వచ్చి వెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు, పార్టీలకు మద్ధతు తదితర అంశాలకు త్వరలోనే వ్యూహాలు రచించే అవకాశం వుంది. 

click me!