దగ్గుబాటికి దారులు మూసుకుపోయినట్లేనా ?

First Published Apr 2, 2018, 11:45 AM IST
Highlights
వచ్చే ఎన్నికల్లో వారసులను రంగంపైకి తేవాలని అనుకుంటున్న నేతల ఆశలపై ఒక్కసారిగా నీళ్ళు కుమ్మరించినట్లే కనబడుతోంది.

శరవేగంగా మారిపోతున్న రాజకీయ సమీకరణలు కొందరు నేతలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వారసులను రంగంపైకి తేవాలని అనుకుంటున్న నేతల ఆశలపై ఒక్కసారిగా నీళ్ళు కుమ్మరించినట్లే  కనబడుతోంది. ఇంతకీ విషయమంతా దగ్గుబాటి కుంటుంబం గురించే.

వచ్చే ఎన్నికల్లో పురంధేశ్వరి ఎంపిగా పోటీ చేయటంతో పాటు కుమారుడు దగ్గుబాటి చెంచురామ్ ను ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీకి పోటీ చేయించాలని చాలా కలలే కన్నారు ఈ దంపతులు. కేవలం కలలు కనటంతోనే ఆగిపోకుండా గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేశారు. టిడిపి-బిజెపి పొత్తుల్లో భాగంగా పర్చూరు సీటును బిజెపికి వదులుకునేట్లు టిడిపి నేతలను ఒప్పించారు.

నిజానికి చాలా చోట్ల లాగే పర్చూరులో కూడా బిజెపికి బలం లేదు. టిడిపి బలమే బిజెపి బలమిక్కడ. అందుకనే చాలా కాలంగా దగ్గుబాటి దంపతులు చాపక్రింద నీరులాగ నియోజకవర్గంలో పర్యటిస్తూ టిడిపి, బిజెపి నేతలతో టచ్ లో ఉన్నారు. బిజెపి తరపున పోటీ చేయబోయే చెంచురామ్ కు మద్దతిచ్చి గెలిపించేలాగ టిడిపిలోని కీలక నేతలు పలువురితో దగ్గుబాటి దంపతులు హామీలు కూడా తీసుకున్నారట.

వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయబోయేది చెంచురామే అంటూ ప్రచారం కూడా చేయిస్తున్నారు. ఎన్నికలు రావటం, నామినేషన్ వేయటమే మిగిలింది అన్నంతగా దంపతులు కొడుకు కోసం అంతలా వర్క్ చేస్తున్నారు. అటువంటిది ఒక్కసారిగా ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేయటంతో దంపతులు షాక్ తిన్నారు.

ఎందుకంటే, టిడిపి సహకారంలేందే బిజెపికి పడే ఓట్లెన్నో అందరికీ తెలిసిందే. ఇంకోవైపు వైసిపి తరపున పోటీ చేయబోయే అభ్యర్ధిని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు కూడా. ఇక టిడిపి అభ్యర్ధి ఎలాగూ ఉంటారు. కాబట్టి పోటీ అంటూ జరిగితే టిడిపి-వైసిపిల మధ్యే ఉంటున్నది వాస్తవం. దాంతో దగ్గుబాటి దంపతులకు ఏం చేయాలో దిక్కు తోచక అవస్తలు పడుతున్నారు.

click me!