దూసుకొస్తున్న ''యాంపిన్'' తుఫాను... ఏపికి పొంచివున్న ప్రమాదం

By Arun Kumar PFirst Published May 15, 2020, 10:31 AM IST
Highlights

ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారనుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్రరూపం దాల్చింది. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. ఇది 16వ తేదీ సాయంత్రం లేదా 17వ తేదీ ఉదయానికి తుఫాన్‌గా మారనున్నది. 

ఈ తుఫాను తొలుత వాయవ్యంగా, తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.  దీంతో ఈనెల 17న 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైనగాలులు వీస్తాయని, 18న ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిషా తీరం వెంబడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఈ తుఫాన్‌కు 'యాంపిన్‌'గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. 

కాగా  ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో 15వ తేదీన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షం, 16న భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 15న రాయలసీమలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, 16న ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.
 

click me!