తెలంగాణతో వివాదాలు, విభేదాలు కోరుకోవడం లేదు: ఏపీ మంత్రి అనిల్ కుమార్

By narsimha lodeFirst Published Jun 6, 2020, 3:46 PM IST
Highlights

 తెలంగాణతో తాము ఎలాంటి వివాదాలు, విభేదాలు కోరుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తేల్చి చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నాయి.


అమరావతి: తెలంగాణతో తాము ఎలాంటి వివాదాలు, విభేదాలు కోరుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తేల్చి చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నాయి. కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాలు ముగిసిన మరునాడే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.

గోదావరి జలాల విషయంలో తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవన్నారు. అయితే ఈ విషయమై గోదావరి నది యాజమాన్య బోర్డు నుండి స్పష్టత రావాల్సి ఉందన్నారు. శనివారం నాడు మంత్రి అనిల్ కుమార్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  వెనుకబడిన రాయలసీమకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు.

గోదావరితో పాటు కృష్ణా నదీ జలాల్లో తమకు రావాల్సిన నీటినే తాము వినియోగించుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.. దీనిలో భాగంగానే పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యం పెంచుతున్నామన్నారు.

పోలవరం ప్రాజెక్టును 2021  డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఐదేళ్లపాటు పదవిలో ఉండి పోలవరం గురించి పట్టించుకోని చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును జగన్ పూర్తి చేస్తారన్నారు.

ఏడాదిలోనే దేశంలోనే ముఖ్యమంత్రుల్లో జగన్ నాలుగవ స్థానంలో నిలిచారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ఏనాడైన టాప్ 5వ స్థానంలో నిలిచారా అని  ఆయన ప్రశ్నించారు. లోకేష్ మొదటి ‌షోతోనే వెనక్కి వెళ్లిపోయే ప్లాప్ సినిమాలాంటి వాడని ఆయన విమర్శించారు.

also read:తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు: ప్రారంభమైన గోదావరి రివర్ బోర్డు మీటింగ్

బీసీలను 30 ఏళ్లుగా చంద్రబాబునాయుడు మోసం చేశాడని ఆయన ఆరోపించారు. బీసీలకు తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. బీసీలకు ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టని పథకాలను జగన్ ప్రవేశ పెట్టారన్నారు.


 

click me!