విశాఖలో కరోనా కలకలం: విమాన, రైలు ప్రయాణీకులకు పాజిటివ్

By narsimha lodeFirst Published Jun 6, 2020, 3:24 PM IST
Highlights

వివిధ ప్రాంతాల నుంచి విమానంలో వస్తున్న ప్రయాణికుల్నీ కరోనా వదలడం లేదు. తాజాగా ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ విమానాశ్రయం వద్ద  థర్మల్ స్క్రీనింగ్ పై అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 


విశాఖపట్టణం:  వివిధ ప్రాంతాల నుంచి విమానంలో వస్తున్న ప్రయాణికుల్నీ కరోనా వదలడం లేదు. తాజాగా ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ విమానాశ్రయం వద్ద  థర్మల్ స్క్రీనింగ్ పై అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 

 ఢిల్లీ నుంచి విశాఖకు విమానంలో వచ్చిన సబ్బవరం ప్రాంతానికి చెందిన 28ఏళ్ల మహిళకు కరోనా తేలింది. అదే విధంగా సాగర్ నగర్ కు చెందిన ఏడేళ్ల బాలుడికి కూడా పాజిటివ్ సోకినట్టుగా అధికారులు తేల్చారు. వీరిద్దరూ కూడ విమానంలో ఢిల్లీ నుంచి విశాఖకు వచ్చారు. జాతీయ రహదారి సమీపంలోని  సీతారామ కల్యాణ మండపంలో వీరికి పరీక్షలు నిర్వహిస్తే ఈ విషయం వెలుగు చూసింది. కరోనా సోకిన రోగులకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

also read:ఏపీలో కరోనా కరాళనృత్యం: 210 కొత్త కేసులు, మొత్తం 4,460 పాజిటివ్ కేసులు

గోదావరి రైలు ప్రయాణీకులకు కరోనా

గోదావరి రైల్లో విశాఖపట్టణం వచ్చిన ముగ్గురికి కరోనా సోకిందని అధికారులు గుర్తించారు. రైళ్లలో వస్తున్న ప్రయాణీకులపై కూడ అధికారులు నిఘా పెంచారు.
 హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన ఈ రైల్లో పరవాడ మండలం పెద ముషిడివాడకు చెందిన 33ఏళ్ల మహిళ, మల్కాపురానికి చెందిన 25 ఏళ్ల యువకుడు, అగనంపూడికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్ సోకింది.

ఈ ముగ్గురిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ రైల్లో ప్రయాణించిన ఇతర ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్దం చేసుకొంటున్నారు. 

విశాఖపట్టణం జిల్లాలోని పరవాడ మండలం పెదముసిడివాడ చెందిన 33ఏళ్ల మహిళకు కరోనా తేలడంతో ఆ మండల జనం ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ నుంచి ఇక్కడి ఎస్సీ కాలనీలో ఉన్న అత్తవారింటికి నాలుగు రోజుల క్రితం వచ్చిన ఓ సైనికోద్యోగికి కూడా కరోనా నిర్ధారణ అయినట్టు తెలియడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో విశాఖ చెస్ట్ ఆస్పత్రికి బాధితుడ్ని తరలించారు.
 

click me!