మోడీ దీక్ష ఖర్చు అంత, నా దీక్ష ఖర్చు ఇంతే: చంద్రబాబు

By narsimha lodeFirst Published Feb 13, 2019, 1:20 PM IST
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని  డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ వేదికగా జరిగిన  ధర్మపోరాట దీక్షపై జరిగిన  కేబినెట్లో చర్చ జరిగింది

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని  డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ వేదికగా జరిగిన  ధర్మపోరాట దీక్షపై జరిగిన  కేబినెట్లో చర్చ జరిగింది. మోడీని ఇంటికి పంపుతున్నామని చంద్రబాబునాయుడు కేబినెట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో బుధవారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 11వ తేదీన జరిగిన  న్యూఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షపై చర్చ జరిగింది.

ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల ఖర్చు చేసిందని విపక్షాలు ప్రచారం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఈ దీక్షకు కేవలం రూ.2కోట్ల 83 లక్షలు మాత్రమే ఖర్చు అయినట్టు ఆయన చెప్పారు.

గతంలో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం  గుజరాత్‌లో మోడీ చేసిన దీక్షకు  సుమారు. 1కోటి80లక్షలను ఖర్చు చేసినట్టు చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఏపీ రాష్ట్ర హక్కుల సాధన కోసం తాను నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు కేవలం రూ2కోట్ల83 లక్షలను ఖర్చుచేసినట్టు ఆయన గుర్తు చేశారు.

ఈ దీక్ష కోసం ఏర్పాటు చేసిన రెండు రైళ్ల కోసం రూ. కోటి20 లక్షలను ఖర్చు చేస్తే,  ఏపీ భవన్‌లో సౌకర్యాల కోసం మిగిలిన సొమ్మును ఖర్చు చేసినట్టు బాబు వివరించారు. దీక్షకు పెట్టిన ఖర్చు విషయంలో  విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన  తీవ్రంగా ఖండించారు. దీక్ష కోసం ఎంత ఖర్చు చేశామో ప్రజలకు కూడ వివరించాలని ఆయన కోరారు.

ఏపీ హక్కుల కోసం నిర్వహించిన ధర్మపోరాట దీక్ష ఢిల్లీని కదిలించినట్టు బాబు గుర్తు చేశారు.  ఎన్నికల తర్వాత మోడీని ఇంటికి పంపుతున్నామని చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తనకు మనసుంది కానీ, డబ్బులు లేవన్నారు. రాష్ట్రంలోని పేదల కోసం సంక్షేమ పథకాలను చేపట్టేందుకు మనసుంది కానీ, వాటిని అమలు చేసేందుకు రాష్ట్రం వద్ద డబ్బులు లేవని  బాబు చెప్పారు.అయితే  ఈ దీక్ష కోసం ఏపీ సర్కార్ రూ.10 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.  రూ.10 కోట్లు దీక్షకు మంజూరు చేసినా కేవలం రూ.2.83 కోట్లతోనే దీక్షను పూర్తి చేసినట్టు ఈ సమావేశంలో బాబు చెప్పారు.

ఈ మేరకు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ నుండి రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి దీక్ష ఖర్చుకు సంబంధించిన వివరాలను పంపినట్టుగా బాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు. విపక్షాలు ఈ విషయమై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు మండిపడ్డారు.

click me!