చంద్రబాబు, మేము బాగా చేయలేదు, అందుకే ఓడించారు: బాధలేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి

By Nagaraju penumalaFirst Published May 25, 2019, 9:20 PM IST
Highlights

ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన ఆయన ప్రజలు కోరుకున్నట్లు తాము చేయలేదని అందువల్లే ఓడించారన్నారు. ప్రజలకు నచ్చినట్లు చేసి ఉంటే గెలిచేవాళ్లం కదా అన్నారు. ప్రజలు ఇంకా ఏదో ఆశించారని అది తాము చేయలేదని చెప్పుకొచ్చారు. 
 

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, జిల్లాకు చెందిన నేతలుగా తాము ప్రజలు ఆశించింది చేయలేదు కాబట్టే ఓడించారని అభిప్రాయపడ్డారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. 

ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన ఆయన ప్రజలు కోరుకున్నట్లు తాము చేయలేదని అందువల్లే ఓడించారన్నారు. ప్రజలకు నచ్చినట్లు చేసి ఉంటే గెలిచేవాళ్లం కదా అన్నారు. ప్రజలు ఇంకా ఏదో ఆశించారని అది తాము చేయలేదని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే ఈ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధపడటం లేదన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రజలను సంతృప్తి పరచకపోతే ఓడిపోతామని వారికి నచ్చిన విధంగా నడుచుకుంటేనే గెలుస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపోతే తమకు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

ఎన్నికలు అయిపోయాయని అయితే తమకు కార్యకర్తలను కాపాడుకోవడం ముఖ్యమన్నారు. వారికి న్యాయం చేసే వరకు అండగా ఉంటామన్నారు. ఇకపోతే ఈ ఎన్నికల్లో జేసీ కుటుంబం ఘోరంగా ఓటమి చెందింది. 1985 నుంచి జేసీ కుటుంబం రాజకీయాల్లో ఉంది. 

1985లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆనాటి నుంచి 2014 వరకు ఓటమి అనేది ఎరగకుండా అప్రతిహాతంగా గెలుపొందుతూనే ఉన్నారు. పార్టీలు మారినప్పటికీ ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు కాకుండా వారసులను బరిలోకి దింపారు. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగానూ, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపారు. అయితే ఇద్దరూ ఓటమి పాలయ్యారు.  

click me!