బాబు ఇంటికి ఇక నిధులివ్వలేం: ఆర్ అండ్ బీ

By narsimha lodeFirst Published Sep 20, 2018, 12:20 PM IST
Highlights

హైద్రాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 65లో నూతనంగా నిర్మించిన సీఎం ఇంటికి నిధులు ఇక కేటాయించలేమని ఆర్ అండ్ బీ  అధికారులు తేల్చి చెప్పారు. 
 

అమరావతి: హైద్రాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 65లో నూతనంగా నిర్మించిన సీఎం ఇంటికి నిధులు ఇక కేటాయించలేమని ఆర్ అండ్ బీ  అధికారులు తేల్చి చెప్పారు. 

సీఎం ఇంటికి సీసీ కెమెరాల నిమిత్తం రూ. 20 లక్షలు కేటాయించాలని ప్రతిపాదనలు అందాయి, ఈ ఫైల్ ను ఆర్ అండ్ బీలోని ఎలక్ట్రికల్ విభాగానికి పంపారు. అయితే ఇప్పటికే ఎలక్ట్రికల్‌ విభాగం నుంచి సీసీ కెమేరాలకు, సోలార్‌ ఫెన్సింగ్‌ కోసం రూ. 12 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. 

లేక్‌ వ్యూ అతిధి గృహం, మదీనాగూడలోని ఫాం హౌస్, నాలుగేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 24లో అద్దెకున్న ఇంటికి, నారావారిపల్లెలోని ఇంటికి ఈ నిధులు ఖర్చు చేశారు.

సాధారణంగా సీఎం చంద్రబాబు అధికారికంగా క్యాంపు కార్యాలయంగా ఉపమోగిస్తున్న దానికే నిధుల్ని ఖర్చు చేసేందుకే ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తుంది. అధికారికంగా ఉండవల్లి కరకట్ట పక్కనున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా గుర్తించారు. 

ఇక్కడ ఇప్పటికే సీసీటీవీ కెమేరాలు బిగించేందుకు గాను రూ. కోటి ఖర్చు చేశారు. హైదరాబాద్‌లో లేక్‌ వ్యూ అతిధి గృహాన్ని మొట్ట మొదటిసారిగా క్యాంపు కార్యాలయంగా గుర్తించడంతో అక్కడ సీసీటీవీ కెమెరాలను బిగించేందుకు, ఫెన్సింగ్‌ ఏర్పాటుకు రూ. 3 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత మదీనాగూడలో ఫాం హౌస్‌కు, అద్దెకున్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు–24లో నివాసాలకు సీసీకెమేరాలు బిగించాలని నిధులు కేటాయించారు.

సీఎం సొంత జిల్లా చిత్తూరులోని నారావారిపల్లెకు రూ. 36 లక్షలు కేటాయించారు. అయితే సీసీటీవీలకు నిధుల కేటాయింపునకు అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఉన్నత స్థాయిలోనే జోక్యం చేసుకుని నిధుల విడుదలకు అనుమతులిప్పిచ్చారు. 

మళ్లీ హైదరాబాద్‌లోని సీఎం ఇంటికి సీసీ కెమెరాలకు గాను ఇప్పుడు రూ. 20 లక్షలకు ప్రతిపాదనలు పంపడంపై ఆర్‌అండ్‌బీ వర్గాలు ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నాయి. హైద్రాబాద్ ఇంటికి  నిధులు విడుదల చేస్తే  ఆడిట్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదా అనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.


 

click me!