ప్ర‌కాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల.. ఏ జిల్లాకు ఎన్ని క్యూసెక్కులంటే..?

By Galam Venkata Rao  |  First Published Jul 10, 2024, 3:46 PM IST

స‌మ‌ర్థ‌వంత‌మైన జ‌ల వ‌న‌రుల నిర్వ‌హ‌ణ ద్వారా పెద్ద ఎత్తున సంప‌ద సృష్టించ‌వ‌చ్చ‌ని మంత్రి నిమ్మ‌ల రామానాయుడు తెలిపారు. త‌ద్వారా స‌మాజంలోని అన్ని వ‌ర్గాలూ లాభ‌ప‌డ‌ట‌మే కాకుండా ఆయా ప్రాంతాలు, రాష్ట్రం సుభిక్ష‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు.


ప్రాణాల్ని నిలుపుకునేందుకు అత్య‌వ‌స‌ర‌మైన తాగునీటి రంగం గత పాలనలో నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎం చంద్ర‌బాబు మార్గ‌ద‌ర్శ‌కాలతో రాష్ట్రంలో ప్ర‌తి నీటిబొట్టునూ ఒడిసిప‌ట్టి.. స‌ద్వినియోగం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్ర‌జ‌ల తాగు, సాగునీటి అవ‌స‌రాల‌ను తీర్చేందుకు కృషిచేస్తామని చెప్పారు. 

ప్ర‌కాశం బ్యారేజీ- కృష్ణా తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద కాలువ‌ల‌కు బుధవారం నీటిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు, హౌసింగ్‌, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, గ‌నులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఎమ్మెల్యేలు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌, కాగిత కృష్ణ ప్ర‌సాద్‌, యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి... ప‌సుపు కుంకుమ‌లు స‌మ‌ర్పించి నీటిని విడుద‌ల చేశారు.

Latest Videos

undefined

అనంత‌రం మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మాట్లాడుతూ స‌మ‌ర్థ‌వంత‌మైన జ‌ల వ‌న‌రుల నిర్వ‌హ‌ణ ద్వారా పెద్ద ఎత్తున సంప‌ద సృష్టించ‌వ‌చ్చ‌ని.. త‌ద్వారా స‌మాజంలోని అన్ని వ‌ర్గాలూ లాభ‌ప‌డ‌ట‌మే కాకుండా ఆయా ప్రాంతాలు, రాష్ట్రం సుభిక్ష‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. ఉన్న ఆయ‌క‌ట్టును కాపాడుకుంటూ కొత్త ఆయ‌క‌ట్టు అభివృద్ధికి కృషిచేయ‌డం ద్వారా వ్య‌వ‌సాయ రంగాన్ని, రైతుల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించొచ్చ‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు ముందుచూపుతో ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప్రారంభించార‌ని తెలిపారు. దీంతో గోదావ‌రి జ‌లాలు కృష్ణాకు చేరి దాదాపు 13ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు, 30 నుంచి 40 ల‌క్ష‌ల మందికి తాగునీరు అందించేందుకు వీల‌వుతోంద‌న్నారు. నిర్ల‌క్ష్యానికి గురైన ప‌ట్టిసీమ‌తో పాటు తాడిపూడి, పురోషోత్త‌ప‌ట్నం, పుష్క‌రల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ప‌ట్టిసీమ నుంచి 6,500 క్యూసెక్కుల వ‌ర‌కు నీరు విడుద‌ల‌వుతోంద‌ని.. మ‌రో 500-600 క్యూసెక్కుల తాడిపూడి నీరు కూడా దీనికి తోడ‌వుతోందని వివ‌రించారు. ప్రస్తుతం విడుదల చేసిన నీటిని తొలి ప్రాధాన్యంగా తాగునీటికి, త‌ర్వాత ఖ‌రీఫ్ నారుమ‌ళ్ల‌కు ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. తూర్పు డెల్టాలో ఎన్‌టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 7లక్షల 38వేల ఎక‌రాల‌కు సాగునీటితో పాటు 11 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో చెరువుల‌ను నింపి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకు వీల‌వుతుంద‌న్నారు. డెల్టా కాలువ‌లు, డ్రెయిన్ల‌లో పూడిక‌, గుర్ర‌పు డెక్క‌, తూటికాడ వ‌ల్ల నీరు స‌రిగా ప్ర‌వ‌హించ‌డం లేద‌ని.. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌గా యుద్ధప్రాతిప‌దిక‌న గుర్రపుడెక్క‌, తూడు తీసే ప‌నుల‌కు ఆదేశాలిచ్చిన‌ట్లు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు తెలిపారు. 

సాగునీటి రంగానికి తీవ్ర న‌ష్టం: మంత్రి పార్థ‌సార‌థి

గత ఐదేళ్లు స‌రైన నిర్వ‌హ‌ణ లేక సాగునీటి రంగానికి తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని రాష్ట్ర గృహ నిర్మాణం, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి అన్నారు. చిన్నపాటి వ‌ర్షాల‌కు పంట నీట మునిగి రైతుల‌కు న‌ష్టం వాటిల్లే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగానికి సాగునీటి కాలువ‌ల‌తో పాటు డ్రెయిన్లు చాలా ముఖ్య‌మ‌ని.. వీటిలో పూడిక తీయ‌క‌పోవ‌డం వ‌ల్ల కృష్ణా డెల్టా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యార‌న్నారు. పెడ‌న‌, అవ‌నిగ‌డ్డ‌, బంద‌రు ప్రాంతాల రైతులు ఇబ్బందిప‌డ్డార‌న్నారు. మెట్ట‌ప్రాంతాలైన నూజివీడు, మైల‌వ‌రం, తిరువూరు ప్రాంతాల‌కు ప్రాణాధార‌మైన చింత‌ల‌పూడి ఎత్తిపోత‌లకు గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు గారి హ‌యాంలో రూ.4 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే.. గ‌త ప్ర‌భుత్వం రూ.50 కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌న్నారు. దాదాపు 2,80,000 ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌గ‌లిగే సామ‌ర్థ్య‌మున్న చింత‌ల‌పూడిని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల పంట భూములు బీళ్లుగా మారే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఇంత‌లా నిర్ల‌క్ష్యానికి గురైన సాగునీటి రంగం అభివృద్ధికి గౌర‌వ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గారు, జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు గారు కృషిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. కాలువ‌ల‌కు నీరు విడుద‌ల చేసే ముందు నిర్వ‌హ‌ణ పనులు పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

చివ‌రి ఎక‌రాకూ సాగునీరు: మంత్రి కొల్లు ర‌వీంద్ర‌

అనంరం రాష్ట్ర గ‌నులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర మాట్లాడుతూ... గతంలో సాగునీటి మాట అటుంచి కృష్ణా డెల్టా ప్ర‌జ‌లు తాగునీటి స‌మ‌స్య‌తో గొంతెండుతున్న ప‌రిస్థితి ఎదురైంద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితి నుంచి గ‌ట్టెక్కించేందుకు నేడు తూర్పు, ప‌శ్చిమ డెల్టా కాలువ‌ల‌కు నీరు విడుద‌ల చేసినందుకు ముఖ్య‌మంత్రికి, జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రికి ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల‌ను గ‌తంలో హేళ‌న చేస్తూ మాట్లాడార‌ని.. నేడు ఆ ప‌థ‌కంతో ఎంత ప్ర‌యోజ‌నం జ‌రుగుతుందో చూస్తున్నామ‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆదేశాల మేర‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న నిర్వ‌హ‌ణ ప‌నుల‌ను పూర్తిచేసి చివ‌రి ఎక‌రాకూ సాగునీరు అందించేందుకు కృషిచేస్తామని మంత్రి కొల్లు ర‌వీంద్ర తెలిపారు.

కాగా, ప్ర‌కాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు ప్ర‌ధాన కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని మంత్రులు విడుద‌ల చేశారు. ఇందులో రైవ‌స్ కెనాల్‌కు 900 క్యూసెక్కులు, ఏలూరు కెనాల్‌కు 300 క్యూసెక్కులు, బంద‌రు కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్న‌ట్లు ఇరిగేష‌న్ ఎస్ఈ టీజేహెచ్ ప్ర‌సాద్ బాబు తెలిపారు.

click me!