
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు అనేవి రెండు కీలక అంశాలు అనే సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రానికి చెందిన ఎంపీల రాజీనామాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటీవల పోలవరం ముంపు మండలాల్లో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రాజెక్టు పూర్తవడం లేదని ఆరోపించారు. సీఎం జగన్‌కు చేతకాకపోతే రాజీనామా చేయాలని.. ప్రాజెక్టు ఎందుకు పూర్తికాదో తాను చూస్తానని చెప్పారు. పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు.
దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలని తాము కోరితే పట్టించుకోని చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తమ ఎంపీల చేతల రాజీనామా చేయించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం గురించి ఎందుకు టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. ఇక్కడ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఏపీ ప్రత్యేక హోదాకు బదులు.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. అందుకు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు అంగీకరించారు. అయితే ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. దీనిని వ్యతిరేకిస్తూ దీక్షలు, నిరసనలు నిర్వహించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు. ఇది ఒక రకంగా జగన్‌కు రాజకీయంగా కలిసివచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి.
మరోవైపు ప్రత్యేక హోదా, పోలవరం నిధులు వంటి అంశాలు.. ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగితే టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని భావించిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ముందే ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు జగన్ మాత్రం.. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజల్లోకి వెళ్లారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ హక్కు అని అన్నారు.
కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని జగన్ ఆ సమయంలో అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, ప్రత్యేక హోదాపై ఫైల్‌పై సంతకం పెట్టిన పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పారు. 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తేస్తామని చెప్పారు. ఇక, 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది.
అయితే కేంద్రంలో భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. దీంతో జగన్ కేవలం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. పలుమార్లు ప్రధాని మోదీని కలిసి వినతి పత్రాలు కూడా అందజేశారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడినంత బలంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట్లాడటం లేదని వాదన లేకపోలేదు.
అయితే ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం.. చూస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని సూచించడం ద్వారా జగన్‌ను మళ్లీ రెచ్చగొట్టేలా నాయుడు ఒత్తిడి తెచ్చారని విశ్లేషకులు అంటున్నారు. అయితే జగన్ ఈ ట్రాప్ లో పడే అవకాశం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది.
ఎందుకంటే.. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడానికి నవరత్నాలు కీలక భూమిక పోషిస్తాయని జగన్ భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం ఏపీ సీఎం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాల్సి ఉంది.
ఇక, ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యయనం అని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదలపై కేంద్రం వేగంగా స్పందించడం లేదనే సంగతి తెలిసిందే.