
గుంటూరు : ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమంలో ఓ అర్జీదారుడి దెబ్బకు శానిటరీ సూపర్వైజర్.. రైతు గేదెలను తీసుకువచ్చి సచివాలయం వద్ద కట్టేయాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. వింతగా ఉన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ అర్జీదారు.. తన ఇంటి పక్కనున్న గేదెలతో వాసన వచ్చి.. ఇబ్బంది పడుతున్నానని ఏడాది కాలంగా తరచూ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో సానిటరీ సిబ్బంది పలుమార్లు గేదెల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినా.. వారు స్పందించలేదు.
దీని మీద వారు న్యాయస్థానం వరకు వెళ్లారు. ఐతే తరచూ.. ఇదే సమస్యపై స్పందనలో ఫిర్యాదు రావడంతో... చేసేదేమీ లేక శానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు రైతు శ్రీనివాస్ కు చెందిన గేదెలను తీసుకుని వచ్చి సమీపంలోని సచివాలయం వద్ద కట్టేశారు. గేదెలను తీసుకు వచ్చిన అధికారులు.. దూడను తీసుకురాకపోవడంతో అది రంకెలేస్తోంది. స్పందన అర్జీ పరిష్కరించకుంటే తనను సస్పెండ్ చేస్తారని.. అందుకే ఇలా గేదెలను తీసుకువచ్చి సచివాలయం దగ్గర కట్టేయాల్సి వచ్చిందని శానిటరీ సూపర్వైజర్ చెబుతున్నాడు. వాటి పాలన తీసుకోవాలని ప్రజలు రైతుకు సూచించామని అన్నారు. అయితే ఎన్నిసార్లు చెప్పినా అతను పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి తరలించామని చెప్పారు.
Monkeypox: ఏపీలో మంకీపాక్స్ కలకలం.. శాంపిల్స్ ను ఎన్ఐవీకి పంపిన అధికారులు !
ఇదిలా ఉంటే.. ఇలాంటి విచిత్రమైన కేసే అన్నమయ్య జిల్లాలో జూన్ 2న పోలీసులకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలో ఈ కేసు నమోదయ్యింది. పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి తన కోడిపుంజును ఎవరో దొంగిలించారని వాల్మీకిపురం పోలీసులను ఆశ్రయించాడు. ఈ విచిత్రమైన కంప్లైంట్ లో తన తెల్ల కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అతను.
అయితే, ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఫిర్యాదు చూసి జనం నవ్వుకుంటే.. ఎలా పట్టుకోవాలో తెలియక పోలీసులు తెగ ఇదై పోతున్నారు. వెంకటాద్రి.. ఏడాదిన్నర క్రితం తమిళనాడు రాష్ట్రం, సేలం నుంచి జాతి పుంజులు తెచ్చుకుని పెంచుతున్నాడు. అందులో ఒక్కగానొక్క పుంజు మాత్రమే బతికింది. ఆ పుంజును ఎంతో ఇష్టంగా పెంచి పోషిస్తున్నాడు. దీని విలువ సుమారు రూ. 9వేలు. మూడు రోజుల క్రితం దొంగలు కోడిపుంజును ఎత్తుకెళ్లారు.
ఎంతో మురిపెంగా పెంచుకున్న జాతి కోడి పుంజును దొంగిలించారని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాపోయాడు. గ్రామ పరిసరాల్లో కోడిపందాలు జరుగుతుంటాయని, పందాల కోసమే దొంగలు ఎత్తుకెళ్లారు అని అనుమానం వ్యక్తం చేశాడు. అంతేకాదు.. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచుకున్న కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారని కన్నీటి పర్యంతమయ్యాడు. తన కోడిపుంజును తెచ్చి ఇవ్వాలని వెంకటాద్రి వాల్మీకిపురం పోలీసులను వేడుకుంటున్నాడు. వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై బిందుమాధవి మీడియాకు తెలిపారు.