ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో గల లారస్ యూనిట్ లో జరిగి న ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
పరవాడ: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని లారస్ యూనిట్ 3 లో జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం లారస్ యూనిట్ -3 లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కేజీహెచ్ మార్చురీ వద్ద నిన్న మృతుల బంధువులు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 26వ తేదీన లారస్ యూనిట్ -3 లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆరా తీశారు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సీఎం జగన్ కు నివేదించారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటంబాలకు రూ. 25 లక్షలను పరిహారంగా ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
undefined
also read:విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం: నలుగురు కార్మికులు మృతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమల్లో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే ఈ రకమైన పరిస్థితులు నెలకొంటున్నాయని కార్మిక సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.