శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో మాస్క్ తప్పనిసరి..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 9:59 AM IST
Highlights

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా విజృంభణ, భారత్‌లో కూడా కరోనా కేసుల్లో స్వల్ప పెరుదల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. 

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా విజృంభణ, భారత్‌లో కూడా కరోనా కేసుల్లో స్వల్ప పెరుదల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ఇతర టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇటీవలి మార్గదర్శకాల దృష్ట్యా వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోగ్య భద్రత, తిరుమలను సందర్శించే యాత్రికుల భద్రతలో భాగంగా మేము రద్దీగా ఉండే ప్రదేశాలను తరచుగా శుభ్రపరచడం వంటి ఇతర ఏర్పాట్లు చేయనున్నాం’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

ఎక్కువ సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నట్టుగా చెప్పారు. ఈ విధానం గత మూడేళ్ల నుంచి అమల్లో ఉందని అన్నారు. జనవరి 2 నుంచి 11 వరకు రోజుకు 45,000 చొప్పున స్లాటెడ్ సర్వ దర్శనం టిక్కెట్లను జారీ చేయనున్నట్టుగా చెప్పారు. తిరుపతిలోని 9 ప్రదేశాల్లో 92 కౌంటర్ల ద్వారా జనవరి 1వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామన్నారు. తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కౌస్తుభం విశ్రాంతి భవనంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. 10 రోజులకు సంబంధించిన 4.50 లక్షల టోకెన్లు పూర్తయ్యే వరకు జారీ ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. 


శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ఆఫ్‌లైన్‌లో జారీ చేయబడవని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ‘‘జనవరి 2 నుంచి 11 వరకు  ఆన్‌లైన్‌లో రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్‌లను ఇప్పటికే విడుదల చేసాం. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు జారీ చేయబడవు. అదే విధంగా మేము ఆన్‌లైన్‌లో జనవరి 1 నుంచి 11 వరకు 2.05 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ. 300) టిక్కెట్‌లను కూడా జారీ చేసాం. జనవరి 1న నూతన సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు వసతి ముందస్తు బుకింగ్‌లు రద్దు చేయబడ్డాయి’’అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 
 

click me!