విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సెగ ఏపీ బిజెపికి తగిలింది. మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు బిజెపికి రాజీనామా చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు.
విశాఖపట్నం: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి విశాఖ ఉక్కు కర్మాగారం సెగ తగిలింది. పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు బిజెపికి రాజీనామా చేశారు. అదివారంనాడు ఆయన ఎస్ రాయవరంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే బిజెపి నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపారు.
బిజెపి పాలనలో ఏపీకి ఎటువంటి మేలు కూడా జరగకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం చాలా దారుణమని, దానివల్ల బిజెపి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంటుందని ఆయన అన్నారు.
undefined
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు విడుదల జచేయడం లేదని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై, ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని వేలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా కూడా స్పందన లేదని ఆయన విమ్రశించారు. ఈ కారణాల వల్ల తాను బిజెపిని వీడాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి దారుణంగా పరాజయం పాలైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర నిర్ణయం వల్ల ఏపీలో బిజెపి ఆత్మరక్షణలో పడింది.