ఆ కంపనీల శానిటైజర్లనే అమ్మండి..: మెడికల్ షాపులకు సిపి ఆదేశాలు

By Arun Kumar PFirst Published Mar 26, 2021, 1:43 PM IST
Highlights

విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మెడికల్ షాపు ఓనర్స్ అసోషియేషన్, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

విజయవాడ: మధ్యపానప్రియుల ప్రాణాలు హరిస్తున్న శానిటైజేర్ విక్రయాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ఇందులోభాగంగా నగరంలోని మెడికల్ షాపు ఓనర్స్ అసోషియేషన్, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటైజర్స్ అమ్మకాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్ షాపు యాజమాన్యంతో చర్చించారు. వినియోగదారునికి శానిటైజర్ సేవించడం వలన కలిగే ప్రమాదాలు గురించి వివరించాలని చెప్పినట్లు శ్రీనివాసులు ఆదేశించారు. 

మెడికల్ షాపు యాజమాన్యం  లైసెన్స్ కలిగిన కంపెనీలనుండి శానిటైజర్ ను కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ శానిటైజర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. లైసెన్స్ లేని కంపెనీలు శానిటైజర్ ను తయారు చేస్తుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. అవసరానికి మించిన ఎవరైనా శానిటైజర్ కొనుగోలుకు వస్తే పోలీస్ స్టేషన్ కు, పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలి కోరారు. 

గ్రామ వాలంటీర్లు, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శుల సహకారంతో శానిటైజర్ సేవించే వారి పై నిఘా పెట్టాలని పోలీసులకు సిపి ఆదేశించారు. అవసరమైతే  'డి' ఎడిక్షన్ సెంటర్లకు పంపే విధంగా ఎర్పాట్లు చేస్తున్నామన్నారు. శానిటైజేర్ సేవించే స్పాట్ లు గుర్తించి అవగాహనా సదస్సులు నిర్వించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సిపి శ్రీనివాసులు హెచ్చరించారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం దరలు భారీగా పెరగడంతో మద్యపానప్రియులు డబ్బులు లేక వెనకా ముందు ఆలోచించకుండా శానిటైజర్ తాగి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలా శానిటైజర్ తాగి విజయవాడలో ఇద్దరు కార్మికులు శానిటైజర్ తాగి మృతి చెందారు. ఈ క్రమంలోనే పోలీసులు శానిటైజర్ అమ్మకాలపై దృష్టిపెట్టారు. 
 
 

click me!