
విజయవాడ: గతరాత్రి నూజివీడు ప్రాంతానికి చెందిన ఇంటర్ యువతిపై విజయవాడ ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం ఘటన కొత్తమలుపు తిరిగింది. అసలు యువతిపై అత్యాచారయత్నమే జరగలేదని విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు. కిరాయి డబ్బుల విషయంలో ఆటోడ్రైవర్, యువతి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుందని... ఈ క్రమంలోనే అతడు చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో యువతి పోలీసులను ఆశ్రయించినట్లు సిపి వెల్లడించారు.
విజయవాడలో ఆదివారం రాత్రి ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ జరిగిన ప్రచారంపై సిపి స్పందించారు. యువతి పట్ల ఆటోడ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమే... కానీ అత్యాచారయత్నం మాత్రం తప్పుడు ప్రచారమన్నారు. ఈ ఘటనలో పోలీసులు చాలావేగంగా స్పందించారని సిపి క్రాంతి రాణా వెల్లడించారు.
''ఆదివారం రాత్రి డయల్ 100 కు కాల్ వచ్చిన వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నాం. అలాగే స్నేహితున్ని కలిసేందుకు రాత్రి 10గంటల సమయంలో విజయవాడకు చేరుకున్న యువతిని తిరిగి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాం'' అని విజయవాడ సిపి తెలిపారు.
''ఆదివారం నూజివీడుకు చెందిన ఇంటర్ యువతి స్నేహితుడికి కలిసేందుకు విజయవాడకు వచ్చింది. రాత్రి పదిగంటల సమయంలో స్నేహితుడు బసచేసిన హోటల్ అడ్రస్ కోసం ఓ ఆటో డ్రైవర్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఆటో కిరాయి విషయంలో యువతి, డ్రైవర్ మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆటో డ్రైవర్ కాస్త అతిచేస్తూ యువతి చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు'' అని వివరించారు.
''తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆటో డ్రైవర్ ను యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే యువతి డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సహాయాన్ని కోరింది. దీంతో కేవలం 5 నిమిషాల్లోనే స్థానిక పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అలాగే యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు'' అని సిపి వెల్లడించారు.
''మహిళలు, యువతులు ఒంటరిగా సమయం కాని సమయంలో బయటకు వచ్చేటప్పుడు కుటుంబసభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. అలాగే సోషల్ మీడియాతో పాటు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే కొత్తవ్యక్తులతో జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా ముఖపరిచయం లేని వ్యక్తులను నమ్మొద్దు'' అని సిపి క్రాంతి రాణా సూచించారు.
''మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. మహిళలు, యువతులు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మహిళలకు ఆపద సమయంలో దిశ యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది'' అని సిపి క్రాంతి రాణా టాటా సూచించారు.
ప్రచారం జరిగిందిలా:
నూజివీడు ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ బాలికకు, బెంగుళూరుకు చెందిన అంజనేయులు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆంజనేయులును కలిసేందుకు బాలిక ఆదివారం విజయవాడకు వెళ్లింది. రాత్రి 10గంటల సమయంలో హోటల్ అడ్రస్ చూపిస్తానంటూ బాలికను ఆటో ఎక్కించుకున్నాడు డ్రైవర్. బాలికను నేరుగా నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలిక పెద్దగా కేకలు వేయడంతో భయపడిపోయి అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు ఇది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కాని విజయవాడ పోలీస్ కమీషనర్ మాత్రం యువతిపై ఎలాంటి అత్యాచారయత్నం జరగలేదని వెల్లడించారు.