
(Updated on June 25th, 2024)
తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న కొందరు పార్టీ ఫండ్ కోసం వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన ఓ వ్యాపారి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాల్లో లాజిస్టిక్స్ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తుంటారు.
తెలుగుదేశం పార్టీకి చాలా కాలం పాటు సానుభూతిపరుడిగా, పార్టీకి అనుబంధంగా పనిచేశారు. కొన్ని కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఓ కేంద్ర మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడితో ఈ వ్యాపారికి పరిచయం ఉంది.
గతంలో వీరిద్దరూ కలిసి రూ.10 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీ కోసం ఫండ్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి సన్నిహితుడు, వ్యాపారిని కోరారు. తన ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేదని ఇప్పుడు ఇవ్వలేనని తేల్చి చెప్పారు.
దీనికి ఒప్పుకోని మాజీ మంత్రి సన్నిహితుడు మీకు పార్టీ 8 కోట్ల ఫండ్ టార్గెట్ ఇచ్చిందని చెప్పాడు. దీంతో వ్యాపారి ఈసారికి ఇవ్వలేనని తెగేసి చెప్పడంతో మరో ఇద్దరు రంగంలోకి దిగారు.
తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే పంజాగుట్ట సర్కిల్‌లో నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ఆ వ్యాపారి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని, నీవు వ్యాపారాలు ఎలా చేస్తావో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కోర్టు అనుమతి తీసుకుని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.