
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాధా వివాదానికి ఫుల్ స్టాప్ ఇప్పట్లో పడేలా కనబడటం లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జరిపిన చర్చలోనైనా ఓ కొలిక్కి వస్తుందని ఆశిస్తే ఆ చర్చలు కూడా దాదాపు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటును మాజీఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేటాయించడంతో అప్పటి నుంచి వంగవీటి రాధా ఆగ్రహంగా ఉన్నారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాధాతో భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు రాధాతో చర్చించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యాలంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే విజయసాయిరెడ్డి ఆఫర్ పై రాధా మౌనంగా ఉండిపోయారని సమాచారం.
వంగవీటి రాధా 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంగవీటి రాధాను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై దృష్టిసారించాలని పార్టీ ఆదేశించింది.
దీంతో వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై దృష్టీ కేంద్రీకరించారు. అయితే ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్న మాజీఎమ్మెల్యే మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు కేటాయించడంతో రాధా గుర్రుగా ఉన్నారు. వైసీపీ నేతలు బుజ్జగించినా రాధా మాత్రం తన పట్టువీడటం లేదు. తాజాగా విజయసాయిరెడ్డి చర్చల్లోనూ రాధా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.