బుజ్జగింపులు:వంగవీటి రాధాతో విజయసాయిరెడ్డి భేటీ

By Nagaraju TFirst Published Oct 10, 2018, 4:59 PM IST
Highlights

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అలకబూనిన వైసీపీ నేత వంగావీటి రాధాను బుజ్జగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ రంగంలోకి దిగింది. విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు కేటాయించడంతో ఆగ్రహం చెందిన రాధా అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. 

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అలకబూనిన వైసీపీ నేత వంగావీటి రాధాను బుజ్జగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ రంగంలోకి దిగింది. విజయవాడ సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు కేటాయించడంతో ఆగ్రహం చెందిన రాధా అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. 

అయితే రాధా పార్టీ మారతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపింది. విజయసాయిరెడ్డి వంగవీటి రాధాను కలిశారు. రాధాతో ఏకాంతంగా విజయసాయిరెడ్డి చర్చలు జరుపుతున్నారు. 

గత 2014 ఎన్నికల్లో వంగవీటి రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దాంతో రాధాను విజయవాడ సెంట్రల్ సీటుపై దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ ఆదేశించింది. దాంతో రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తిష్టవేశారు. నియోజకవర్గం ఇంచార్జ్ గా పలు కార్యక్రమాలు సైతం చేపట్టారు.

అయితే ఇటీవలే మాజీఎమ్మెల్యే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి విష్ణుకు రంగాకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. అయితే అవి రోడ్డునపడకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లాది విష్ణును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించడంతో రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు వంగవీటి రంగా అభిమానులు, రాధా మిత్రమండలి సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాధా సోదరుడు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ జనసేన పార్టీలోకి చేరిపోయారు. 

వంగావీటి రాధాను బుజ్జగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు నేరుగా రాధాను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి కూడా రాధాలో ఎలాంటి మార్పు కనబడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డి మరోసారి రాధాను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. 

click me!