తనకు ఇష్టమైన టిఫిన్ తినేందుకు గన్నవరం నుండి విజయవాడకు ప్రత్యేకంగా వెళ్ళారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
విజయవాడ : సినిమాల్లో త్రివిక్రమ్ మాదిరిగా రాజకీయాల్లో మాంత్రికుడు ఎవరంటే వెంకయ్య నాయుడు పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అచ్చ తెలుగులో అయినా, ఇంగ్లీష్, హిందీలో అయినా ఆకట్టుకునేలా, చమత్కారంగా మాట్లాడే సత్తావున్న నాయకుడు వెంకయ్య. అయితే భారత ఉపరాష్ట్రపతిగా నియమితులైన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన వెంకయ్య మాటలు తగ్గించారు. కానీ నోటికి మాత్రం పని తగ్గించినట్లున్నారు... రుచికరమైన ఇడ్లీ తినేందుకే గన్నవరం నుండి ప్రత్యేకంగా విజయవాడకు వెళ్ళారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య.
రాజకీయాలకు దూరంగా వుంటున్న మాటల మాంత్రికుడు వెంకయ్య కాస్త భోజనప్రియుడుగా మారిపోయినట్లు కనపిస్తోంది. ఇంత కాలం రాజకీయాలతో బిజీబిజీగా గడిపిన వెంకయ్య నాయుడు ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. ఈ వయసులో నోరు కట్టుకుని వుండలేక రుచికరమైన ఆహారం ఎక్కడ దొరికితే అక్కడ వాలిపోతున్నారు. ఇలా ఆరోగ్యానికి ఆరోగ్యం... రుచికి రుచి కలిగిన నేతి ఇడ్లీలను లాగించేందుకు విజయవాడలో ప్రత్యక్షమయ్యారు.
వీడియో
విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ ఎస్ఎస్ఎస్ ఇడ్లీ సెంటర్ (పాక ఇడ్లీ) తెలియని వారు వుండరు. ఇక్కడ నేతి ఇడ్లీలను తినేందుకు ప్రజలు బారులు తీరుతుంటారు. ఈ రుచికరమైన నేతి ఇడ్లీలను తినేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ఇవాళ ఉదయం ఎస్ఎస్ఎస్ టిఫిన్ సెంటర్ కు చేరుకున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి పాక ఇడ్లీ సెంటర్ వద్దకు వెళ్లి నేతి ఇడ్లీలు చాలా ఇష్టంగా తిన్నారు వెంకయ్యనాయుడు.
Read More అన్నదాతకు కూడా స్వాంతన చేకూర్చలేని ఈ ప్రభుత్వం ఎందుకు ? - నారా లోకేష్
ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఇడ్లీలను అందిస్తున్న టిఫిన్ సెంటర్ నిర్వహకుడు కృష్ణ ప్రసాద్ ను వెంకయ్యనాయుడు అభినందించారు. ప్రజలు కూడా అపరిశుభ్ర ప్రదేశాల్లో అనారోగ్యకర ఆహారం తీసుకోకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవాలని వెంకయ్య సూచించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... పాక ఇడ్లీ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. గతంలో ఎప్పడో ఓ సారి ఇక్కడి ఇడ్లీ తిన్నానని... ఆ రుచి మరిచిపోలేక మళ్లీ ఇప్పుడు వచ్చానని అన్నారు. ఇలాంటి నాణ్యమైన ఆహారాన్నే తీసుకుని యువత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని... సాంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచించారు. పాశ్చాత్య వంటకాలైన పిజ్జా, బర్గర్ల మోజులో నేటి యువత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని... వారికి మన సాంప్రదాయ ఆహారాల రుచి చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని సూచించారు. అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ అమృతమేనని వెంకయ్య అన్నారు.
బలవర్దకమైన సాంప్రదాయ వంటకాలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయని వెంకయ్య అన్నారు. వ్యాయామం మనకి ఎంత ముఖ్యమో మన వంటలు తినడం అంతే ముఖ్యమని అన్నారు. మన పూర్వీకుల ఆహార అలవాట్లను మనందరం అలవర్చుకోవాల్సిన అవసరం వచ్చిందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.