పవన్ ఆగ్రహంతో టీజీపై అసహనం డ్రామాలు: వాసిరెడ్డి పద్మ

By Nagaraju TFirst Published Jan 23, 2019, 5:50 PM IST
Highlights

చంద్రబాబును కలసిన తర్వాతే ఎంపీ టీజీ వెంకటేశ్‌ జనసేనతో పొత్తు అంటూ మాట్లాడతారని.. కానీ ఆ కొద్ది సేపటికే టీజీపై చంద్రబాబు అసహనం అని లీకులు ఇస్తారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ప్రీ ప్లానెడ్ మర్డర్ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగన్ పై జరిగిన హత్యాయత్నం కుట్ర ప్రకారమే జరిగిందన్నారు. 

ఈ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం సిట్ ను నియమించిందని విమర్శించారు. జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముందుకు సాగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 

ఎన్‌ఐఏ విచారణలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ పాత్ర బయటకు వస్తుందనే భయం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. అందుకే సిట్‌ దర్యాప్తు మాత్రమే ఫైనల్‌ కావాలనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. 

ఎన్‌ఐఏ విచారణను ఆపేందుకు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారని తెలిపారు. దాడి కేసుకు సంబంధించి ఆధారాలను ఎన్‌ఐఏకు ఇవ్వకుండా ఏపీ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఎన్‌ఐఏ విచారణకు చంద్రబాబు అడ్డుపడటం చూస్తుంటే ఈ కేసులో ఆయన పాత్ర ఉందనేది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు తీరును అంతా గమనిస్తున్నారని చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 

మరోవైపు జాతీయ రాజకీయాలు అంటూ చంద్రబాబు గొప్పలు ఏపీలో గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ ఢిల్లీలో అలాంటి పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు ఇతర పార్టీ నేతలు టైం ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ చంద్రబాబు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 

స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. ఈవీఎంలు వద్దంటున్న చంద్రబాబు మరి 2014లో ట్యాంపరింగ్‌ చేసే గెలిచారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును కలసిన తర్వాతే ఎంపీ టీజీ వెంకటేశ్‌ జనసేనతో పొత్తు అంటూ మాట్లాడతారని.. కానీ ఆ కొద్ది సేపటికే టీజీపై చంద్రబాబు అసహనం అని లీకులు ఇస్తారని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన అంతా ఒక్కటేనని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.  
 

click me!
Last Updated Jan 23, 2019, 5:50 PM IST
click me!