ఏపీలో తాలిబాన్లను మించిన అరాచకం... నేర రాజకీయాలపై పేటెంట్ వైసిపిదే: వర్ల సంచలనం

By Arun Kumar PFirst Published Aug 26, 2021, 5:17 PM IST
Highlights

అసాంఘిక శక్తులకు, నేరమయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్, దేశంలో నేరపూరిత రాజకీయాలపై పేటెంట్ హక్కులు పొందే అర్హత కలిగిన ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ అని టిడిపి నాయకులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. 

అమరావతి: ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కుతూ, దేశంలోనే అత్యంత అవినీతిపరుడిగా ముద్రపడిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న పార్టీ వైసీపీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఇంత తక్కువ సమయంలో ఏ విధంగా ఇన్ని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారన్న న్యాయస్థానాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకుండా తోకముడిచిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా? అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్టీలో ఉన్న నేతలు రాజకీయాల్లోకి అసాంఘిక శక్తులు ప్రవేశించాయి అంటూ వ్యాఖ్యానించడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని వర్ల మండిపడ్డారు.  

''అసాంఘిక శక్తులకు, నేరమయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ. దేశంలో నేరపూరిత రాజకీయాలపై పేటెంట్ హక్కులు పొందే అర్హత కలిగిన ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ. గత రెండేళ్లుగా రాష్ట్రంలో తాలిబాన్ నియంతృత్వాన్ని మించిన అరాచకాన్ని సృష్టిస్తూ.. నేరమయ రాజకీయాల గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదం'' అన్నారు. 

''ఇటీవల విడుదలైన ఏడీఆర్ నివేదిక వైసీపీకి చెందిన 18మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు క్రిమినల్ కేసుల్లో ఉన్నారంటూ వారి ఘనమైన నేరచరిత్రను బట్టబయలు చేసింది. ఆ పార్టీ అధినేతపైనే దాదాపు 31 కేసులున్నాయి. క్విడ్ ప్రోకో, మనీలాండరింగ్ కేసుల్లో సీబీఐ 11, ఈడీ 8 చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డిపై రూ.43వేల కోట్ల అవినీతికి సంబంధించి కేసులున్నాయి'' అని తెలిపారు. 

read more  రాజకీయాల్లో నేరస్తుల్ని నిలువరించినపుడే అసలైన ప్రజాస్వామ్యం: యనమల

''పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి మొదలుకొని ప్రతి నాయకుడిపై ఏదో ఒక రకమైన కేసులున్నాయి. అంతకుమించి అసాంఘిక శక్తులు రాష్ట్రంలో ఏమున్నాయి? వైసీపీ నేతల నేరచరిత్రను అచ్చువేయాలనుకుంటే గ్రంధమవుతుంది. చెప్పాలంటే సీరియల్ అవుతుంది'' '' అని వర్ల అన్నారు. 

''కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తాము చెప్పినట్లుగా ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టాలని అధికారుల్ని బెదిరించారు. మాట వినకపోయేసరికి ఎస్పీని బదిలీ చేయించారు. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహిళా ఎంపిడిఓ ఇంటిపైకి వెళ్లి బెదిరించారు. చనిపోయిన జంతు కళేబరాలు తీసుకెళ్లి ఇంట్లో వేశారు. నెల్లూరుకు చెందిన ఒక పత్రికాధిపతిపై దాడి వంటి ఘటనలకు సజ్జల ఏం సమాధానం చెబుతారు?'' అని నిలదీశారు. 

''వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై 500కు పైగా దాడులు, అత్యాచారాలు, హత్యలు చోటుచేసుకున్నాయి. చివరికి సొంత బాబాయి హత్య కేసును కూడా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తూ, సాక్షులుగా ఉన్నవారు అనుమానాస్పదంగా ప్రాణాలొదులుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉంటే రాజకీయాల్లో నేరచరితులు ప్రవేశిస్తున్నారంటూ సజ్జల చేస్తున్న వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి'' అన్నారు.

''నిజంగా సజ్జలకు చిత్తశుద్ది ఉంటే ముందు తమ పార్టీలోని నేరచరితుల గురించి మాట్లాడాలి. జగన్ రెడ్డి రూ.43వేల కోట్ల అవినీతి గురించి, షెల్ కంపెనీల గురించి, క్విడ్ ప్రో కో అవినీతిపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. కేవలం ఐదేళ్లలో అన్నివేల కోట్ల ఆస్తులు జగన్ రెడ్డికి ఎలా వచ్చాయి అన్న న్యాయస్థానాల ప్రశ్నలకు సమాధానమివ్వండి. ఆ తర్వాత నేరమయ రాజకీయాల గురించి మాట్లాడాలి'' అని వర్ల రామయ్య సూచించారు. 


 
 
 

click me!