విశాఖ: ఫార్మా కంపెనీ నుంచి విష వాయువు లీక్.. పెను ప్రమాదాన్ని తప్పించిన టెక్నికల్ టీమ్

By Siva KodatiFirst Published Aug 26, 2021, 4:12 PM IST
Highlights

విశాఖపట్నం పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి గురువారం ప్రమాదకర రసాయన వాయువు లీక్ అయింది. వెంటనే స్పందించిన టెక్నికల్ టీమ్ లీకేజీని ఆపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 

విశాఖపట్నంలో మరోసారి విషవాయువు లీకేజీ కలకలం రేగింది. నగరంలోని పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి గురువారం ప్రమాదకర రసాయన వాయువు లీక్ అయింది. ఫార్మా కంపెనీలో ఓ బాయిలర్ నుంచి విషవాయవులు లీక్ కావడంతో కార్మికులు ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమీప గ్రామాల ప్రజలు కూడా దీని ప్రభావానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వెంటనే స్పందించిన ఫార్మా కంపెనీ అధికారులు కార్మికులను పరిశ్రమ నుంచి బయటికి పంపేశారు. రసాయన వాయువు లీకేజిని గుర్తించిన సాంకేతిక బృందం నష్టం జరగకుండా నివారించింది. కొద్దిసేపు శ్రమించి లీకేజిని అరికట్టింది. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు, పోలీసులు, యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఇక గతేడాది ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో 11 మంది చనిపోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

click me!