వైసీపీ ప్రభుత్వ దళిత వ్యతిరేకతకు ఇదే పరాకాష్ట: వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Aug 5, 2020, 6:52 PM IST
Highlights

ముఖ్యమంత్రి జగన్  అధికారంలోకి వచ్చిన నాటినుండి "దళితులను" టార్గెట్ చేస్తూ యధేచ్చగా వరుస దాడులు జరగడం దారుణమని తెలుగుదేశ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు.

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్  అధికారంలోకి వచ్చిన నాటినుండి "దళితులను" టార్గెట్ చేస్తూ యధేచ్చగా వరుస దాడులు జరగడం దారుణమని తెలుగుదేశ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన దళితులపైనే దాడులు చేయడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల మద్దతుతో అరాచకవాదుల స్వైర విహారం చేయడంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. 

''వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని అర్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీనేతలు చేస్తున్న  అన్యాయానికి, అక్రమాలకూ అష్టకష్టాలు పడుతున్న దళితులకు రక్షణ కల్పించడంలో  పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. శిరోముండనం కేసులో కవల కృష్ణమూర్తిని ముద్దాయిని ఇంతవరకూ అరెస్ట్ ఎందుకు చేయలేదు?'' అని ప్రశ్నించారు. 

''దళితులపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను ఎస్సీ ఎస్టీ యాక్టు క్రింద అరెస్ట్ చెయ్యాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యమైంది. ఎస్సీ, ఎస్టీ చట్టం అంటే దుండగులకు భయం లేకుండా పోతోంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

read more   దళితుడిపై దాడి.. కాశీబుగ్గ సీఐపై చర్యలు: హోంమంత్రి సుచరిత

''మొన్న విశాఖలో డాక్టర్ సుధాకర్ ను రోడ్డుపైనే చేతులు కట్టేసి హింసించారు. హైకోర్టు జోక్యంతో సుధాకర్ బతికి బట్టబట్టగలిగారు. చిత్తూరు జిల్లాలో దళిత జడ్జి రామకృష్ణను వెంటాడి వేధిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి దళిత జడ్జిని ``వాడూవీడూ’’అన్నా చర్యలు లేవు.  అదే జిల్లాలో దళిత వైద్యురాలు అనితారాణిపై అసభ్యంగా వ్యవహరించినా నిందితులను శిక్షించలేదు'' అని గుర్తుచేశారు. 

 ''రాజమహేంద్రవరంలో దళిత మైనర్ బాలికపై మృగాళ్ళు అతిక్రూరంగా అత్యాచారం చేసిన నిందితులపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోముండనం చేయడానికి బాధ్యుడైన కవల కృష్ణమూర్తిపై కేసు పెట్టలేదు. కవల కృష్ణమూర్తిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మాస్కు పెట్టుకోలేదని కిరణ్ అనే యువకున్ని కొట్టి చంపడం అత్యంత హేయం'' అని అన్నారు. 

''తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం చెందిన మర్రి జగన్‍  వైసీపీ నాయకులు దాడి చేశారని న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళితే నడి రోడ్డుపై తల్లి ముందే సీఐ బూటు కాలితో తన్నడం వైసీపీ ప్రభుత్వంలో దళితులపై వ్యతిరేకతకు పరాకాష్ట'' అని మండిపడ్డారు. 

''జగన్ గారూ మీ ప్రభుత్వంలో  రాష్ట్రంలో  దళితులకు జీవించే హక్కు లేకుండా పోయింది. ఇకనైనా మా వర్గ దళితులపై దాడులకు పాల్పడుతున్న అరాచక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి రక్షణ కల్పించాలని కోరుతున్నాను. సోదర దళితులపై దాడులకు పాల్పడ్డ నిందితులపై తక్షణం ఎస్సీ,ఎస్టీ చట్టం ప్రకారం కేసు పెట్టాలి. మీనమేషాలు లెక్కపెట్టకుండా అందరినీ అరెస్ట్ చేసి దళితులు స్వేచ్చగా బతక వచ్చన్న భరోసా కల్పించాలి'' అని వర్ల రామయ్య సూచించారు. 

 

click me!