పవన్ కల్యాణ్ తో రెండు సార్లు భేటీ: అయినా తేల్చని వంగవీటి రాధా, ఆంతర్యం ఏమిటి?

By Nagaraju penumalaFirst Published Jul 4, 2019, 12:50 PM IST
Highlights

ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెండుసార్లు కలవడంతో ఆయన జనసేనలో చేరే అంశంపై అభిమానులు, కార్యకర్తలతో పంచుకుంటారని భావించిన నేపథ్యంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో రాధా జనసేనలో చేరతారా లేక చేరదామనే ఆలోచన విరమించుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. 
 

విజయవాడ : బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్న రాధా గత కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనను గందరగోళంలో నెట్టేస్తున్నాయి. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన రాధా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెండుసార్లు కలిశారు వంగవీటి రాధా. జనసేనలో చేరేందుకు రాధా అన్ని ఏర్పాట్ల పూర్తి చేసుకున్నారని దివంగత నేత వంగవీటి రంగా జయంతి నాడు పవన్ సమక్షంలో జనసేనలో చేరతారంటూ ప్రచారం జరిగింది. 

వంగవీటి రంగా జయంతి రోజైన జూలై నాలుగన కూడా తన రాజకీయ భవిష్యత్ పై రాధా ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. జూలై 4 గురువారం ఉదయం వంగవీటి మోహన రంగా 72వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వంగవీటి రాధా తన రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకటన చేయబోతారని అంతా ఆశగా ఎదురుచూశారు. 

రాధా రాజకీయ నిర్ణయం ఎలా ఉండబోతుందని తెలుసుకునేందుకు మోహనరంగా అభిమానులు రాధ రంగా మిత్రమండలి సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన రాధా అభిమానులకు పంచిపెట్టారు. 

తన తండ్రి వంగవీటి మోహన్ రంగ ఆశయాల సాధన కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. పేద, బడుగు బలమీన వర్గాల కోసం తన తండ్రి వంగవీటి మోహన రంగా పాటుపడ్డారని తెలిపారు. రంగా ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని అందరివాడు అంటూ చెప్పుకొచ్చారు. 

అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. కానీ ఎలాంటి ప్రకటన చేయకుండానే వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రెండుసార్లు కలవడంతో ఆయన జనసేనలో చేరే అంశంపై అభిమానులు, కార్యకర్తలతో పంచుకుంటారని భావించిన నేపథ్యంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో రాధా జనసేనలో చేరతారా లేక చేరదామనే ఆలోచన విరమించుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. 

ఇకపోతే వంగవీటి రాధా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ స్టార్ కాంపైనర్ గా పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, వైయస్ జగన్ పైనా నిప్పులు చెరిగారు. 

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ ఓటమిపాలైంది. దాంతో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్నికల అనంతరం నెలరోజులపాటు మౌనంగా ఉన్న రాధా ఆకస్మాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది. రెండు సార్లు పవన్ కళ్యాణ్ ను కలవడంతో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది.

మెుత్తానికి రాధా జనసేనలో చేరతారా చేరరా అనేది ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాస్త సమయం తీసుకుని చేరదామని భావిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. వంగవీటి రాధా ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న టెన్షన్ మాత్రం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో మాత్రం ఉత్కంఠ వీడటం లేదు. 

click me!