
విజయవాడ: బయటివాళ్లు వచ్చి ఇక్కడ గొడవలు చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. సోమవారం నాడు రాత్రి ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడివారో వచ్చి ఇక్కడకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని వంశీ చెప్పారు. గొడవలకు ఒక వర్గం రెచ్చగొడితే మరో వర్గం దాడికి దిగుతుందన్నారు.ఎవరూ కూడా ఒకరిపై మరొకరు దాడికి చేయబోరని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు తమ వారిని రెచ్చగొట్టారని వల్లభనేని వంశీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇవాళ జరిగిన ఘటనలతో తనకు సంబంధం లేదన్నారు. తనను విమర్శిస్తే చంద్రబాబునాయుడు దృష్టిలో పెద్ద నాయకుడిగా మారిపోతారనే కొందరు భ్రమల్లో ఉన్నారన్నారు. ఈ కారణంగానే తనపై విమర్శలు చేస్తున్నారని వల్లభనేని వంశీ చెప్పారు. సోషల్ మీడియాల్లో తనకు వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారని ఆయన చెప్పారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తే ఊరుకొనేంది లేదన్నారు.
గత మూడు రోజుల క్రితం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీప చీఫ్ చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేశారు.ఈ విమర్శలకు స్థానిక టీడీపీ నేతలు కౌంటరిచ్చారు. తమ నేతల ఇళ్లలోకి వెళ్లి ఎమ్మెల్యే వంశీ మనుషులు బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు వెళ్లే సమయంలో వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ, వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయంపై వంశీ మనుషులు దాడికి దిగారు. టీడీపీ కార్యాలయం ఆవరణలో పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టారు.హైద్రాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణుుల బైఠాయించి నిరసనకు దిగారు. నిరసనకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు.
also read:గన్నవరంలో ఉద్రిక్తత: టీడీపీ ఆఫీస్‌పై ఎమ్మెల్యే వంశీ వర్గీయుల దాడి, కారుకు నిప్పు
అంతకుముందు టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ రాళ్ల దాడిలో సీఐకి గాయాలయ్యాయి. సోమవారంనాడు రాత్రి టీడీపీ నేత చిన్నా కారుకు వంశీ వర్గీయులు నిప్పు పెట్టారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగారు.