చంద్రబాబు, నారా లోకేష్ టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ విరుచుకుపడ్డారు. తానేమైనా నోటుకు ఓటు కేసులో ఉన్నానని వంశీ చంద్రబాబును ప్రశ్నించారు. దొడ్డిదారిలో నారా లోకేష్ ఎమ్మెల్సీ, మంత్రి అయ్యాడని విరుచుకపడ్డారు.
విజయ.వాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, ఆయన తనయుడు నారా లోకేష్ ను, టీడీపీ నేతలను తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని ఏకిపారేశారు. వారిపై వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను తేవాలని తనకూ కొడాలి నానికి చెప్పినప్పుడు మొహానికి రంగులు వేసుకునే వారు రాజకీయాల్లోకి పనికి రారని మీరే అన్నారు కదా అని తాము అడిగామా ఆని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.
రంగులు వేసుకునేవారు రాజకీయాలకు పనికి రారని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ వంశీ ఆ విధంగా అడిగారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తాను నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఆయన శనివారంసాయంత్రం మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి, వైసిపి ప్రభుత్వం పురిటివాసనలోనే ఉంది, నెలో రెండు నెలలో సమయం ఇద్దామని తాను అన్నట్లు ఆయన తెలిపారు.
పేదలకు ఇంగ్లీష్ నేర్పితే తప్పేమిటని ఆయన అడిగారు. తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మీడియానికి మారి చాలా మంది ఇబ్బంది పడ్డారని, తాను తెలుగు మీడియంలో చదువుకున్నానని, స్టేట్ ర్యాంకర్ అని, ఆ తర్వాత తాను ఇబ్బంది పడ్డానని, అందువల్ల సిఎంకు సహకరిస్తానని చెప్పానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి నడుస్తానని చెప్పానని ఆయన చెప్పారు.
ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సింగపూర్.. వంటి ప్రదేశాలను దూరదృష్టితో చూడగలిగాడని ఆయన అన్నారు. జగన్ ను కత్తితో పొడిచిన సంఘటనపై మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ విజయమ్మ, షర్మిల పొడిపించారని అన్నట్లు తనకు గుర్తు ఉందని ఆయన అన్నారు. తానైతే అలా మాట్లాడలేదని అన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు లోకేషో మరెవరో బాంబు పెట్టారని తాను అనలేదని వ్యంగ్యంగా అన్నారు.
ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి...
రాజేంద్ర ప్రసాద్ ను తాను అన్నా అని అన్నట్లు ఆయన గుర్తు చేశారు. కాళ్లు పట్టుకున్నావని తనను రాజేంద్ర ప్రసాద్ అన్నారని, తాను కాళ్లకు దండం పెడుతానని, తన తండ్రి వయస్సువాడు కాబట్టి తాను చంద్రబాబు కాళ్లకు దండం పెడుతానని, తాను చాలా మందికి దండం పెడుతానని ఆయన అన్నారు. కాళ్లు పట్టుకున్నాడని తనను రాజేంద్ర ప్రాద్ అన్నారని, వసుదేవుడు కూడా గాడిద కాళ్లకు దండం పెట్టాడని తాను అనలేదని వంశీ అన్నారు.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఎక్కడున్నానో తెలియనివాడిని కానని అన్నారు.
తనకు డబ్బులు ఎందుకు ఇచ్చారు, పోటీ చేసినవారందరికీ పార్టీ నిధులు ఇస్తుందని, తనకు కూడా ఇచ్చారని, 2014లో అయితే అది కూడా ఇవ్వలేదని, అందరికి ఇచ్చినట్లుగానే తనకూ ఇచ్చారని ఆయన అన్నారు. టీవీ లైవ్ లో తాను బాధపడిన మాట వాస్తవమని, తనకు బీపీ వచ్చిన మాట నిజమని, వాళ్లలాగా తాను ట్యాబెట్లు వేసుకోలేనని, వాళ్లు ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి నింపాదిగా ఉంటారని ఆయన అన్నారు.
అయ్యప్ప మాల వేసుకుని హైందవ ధర్మాన్ని తాను కించపరిచానని మాట్లాడుతున్నారని అంటూ వేయి కాళ్ల మండపాన్ని కూల్చానా, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశానా, వైజాగ్ లో సీసీ కెమెరాలు పెట్టించానా, తిరుమలలో వశిష్టుల్నీ షర్మిష్టల్నీ పెట్టించానా అని ఆడిగారు. అయ్యప్ప మాల వేసుకున్న నిన్ను ఎందుకు తిట్టాడని తనను అడిగారని, చిన్నవాడిని కదా తిట్టాడని చెప్పానని, పెద్దవాడు కదా తిట్టాడని అన్నానని ఆయన అన్నారు. పవిత్రమైన టీటీడీ సభ్యుల పదవులు అమ్ముకున్నానా అని వంశీ ప్రశ్నించారు. చెగువేరా చేసిన పోరాటంలాగా చేస్తున్నారు, కులాలూ మతాల మధ్య తగువు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఓడిపోయినవాళ్లు, ఏవగించకోబడినవాళ్లు తనకు సలహాలు ఇస్తున్నారని, టీడీపీ నేతలకు పుష్పాంజలి ఘటిస్తున్నానని ఆయన అన్నారు.
కాంగ్రెసు భిక్ష పెట్టింది కదా...
చంద్రబాబు తనకు సీటు ఇస్తే తానేం చేయాలని వంశీ అడిగారు. 1975లో, 1983లో చంద్రబాబుకు కాంగ్రెసు భిక్ష పెట్టింది కదా... కాంగ్రెసులోనే ఉన్నారా అని అడిగారు. రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికిరారని సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు అన్నారని, తమ అమ్మ చెప్తే మామపై పోటీ చేస్తానని కూడా అన్నారని, చంద్రబాబును నమ్మి మంత్రి పదవి కూడా ఇచ్చారని, తనకు ఒక్కడి విషయంలోనే నైతిక విలువలూ, వ్యక్తిత్వమూ కనిపిస్తాయా అని అన్నారు. గురువింద గింజల తీరుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
సిగ్గుంటే వంశీ రాజీనామా చేయాలని నారా లోకేష్ అన్న విషయాన్ని గుర్తు చూస్తే రాజీనామా చేస్తానని తాను చాలా సార్లు చెప్పినట్లు వంశీ తెలిపారు. తాను అడ్డదారిలో ఎమ్మెల్సీ కాలేదని, అడ్డదారిలో మంత్రిని కాలేదని ఆయన అన్నారు. తనకు చెప్పడానికి మాత్రమే రూల్స్ ఉంటాయా, తనకు ఒక్కడికే పార్టీ కన్నతల్లి మిగతావారికి కాదా అని అన్నారు.
మీకు తల్లులు, భార్యలూ లేరా...
సోషల్ మీడియాలో పార్టీ ఆఫీసు నుంచే తనపై వ్యాఖ్యలు పెడుతున్నారని, యాభైకి పైగా వెబ్ సైట్లను కంట్రోల్ చేస్తున్నారని, తనపై ఎందుకు అలా చేస్తున్నారని తాను అడిగితే ఖమ్మం ఆంధ్రజ్యోతి విలేకరి నడిపిస్తున్నాడని, అతనే ఆ వ్యాఖ్యలు చేశాడని చెప్పారని వల్లభనేని వంశీ చెప్పారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ నుంచే తనపై వ్యాఖ్యలు చేశారని, పదివేల కామెంట్లు పెట్టారని, తన వద్ద ప్రింటవుట్లు ఉన్నాయని ఆయన ్న్నారు. ఆయనకు కుటుంబ సభ్యులు లోరే, వాళ్ల భార్యలే భార్యలో, వారి తల్లులే తల్లులో అని వంశీ అన్నారు.
మా తల్లులు తల్లులు కారా, మా భార్యలు భార్యలు కారా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. అలా చేయడానికి మీ కొడుక్కి ఎవరు అధికారం ఇచ్చారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. మీ తల్లిదండ్రుల నుంచి ఎందుకు వచ్చావని చంద్రబాబును అడిగితే గింజుకుంటున్నారని ఆయన అన్నారు. గొర్రెల మందలాగా అంటిపెట్టుకుని ఉంచడానికి తమ మీద అవన్నీ చేస్తారా అని ఆయన అడిగారు. ఇంత వరకు తాను జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చానా, అభద్రతా భావానికి లోనై, వెబ్ సైట్లను నడిపిస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మాత్రమే అన్నానని, అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదని ఆయన అన్నారు.
ప్రజల్లో పలుకుబడి లేనివాళ్లు, ఎన్నికల్లో గెలువలేనివాళ్లు, పెయిడ్ ఆర్టిస్టులు, ఇష్టం వచ్చినవాళ్లు మాట్లాడకూడదని ఆయన అన్నారు. తాను ఆవేశపడిన మాట వాస్తవమని, తనకేమీ కాదని, తాను అడిగినవాటికి సమాధానం చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నారని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. అయ్యప్ప మాల వేసుకుని ఎందుకు అలా మాట్లాడుతున్నావని కాదు, ఇంగ్లీష్ మీడయం కావాలా, వద్దా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తన పిల్లలకూ కుటుంబానికీ అక్కర్లేదని, గన్ మెన్ అవసరం లేదని, ప్రభుత్వ వసతులు అవసరం లేదని అంటూ పార్టీని తీసేద్దాం, మీరంతా రాజీనామా చేయండని ఆయన అన్నారు. ప్రజల్లో ఓడిపోయినవాళ్లు ఎమ్మెల్సీ పదవులను పట్టుకుని ఉంటారు, తాను గెలిచినవాడిని తనను రాజీనామా చేయమంటారని ఆయన లోకేష్ ను ఉద్దేశించి అన్నారు.
పరకాయ ప్రవేశం చేయడానికి తాను విఠలాచార్య సినిమానో మరో సినిమానో తీయలేదని, అదుర్స్ సినిమా మాత్రమే తీశానని ఆయన అన్నారు. కల్పనక్క నాకు శత్రువా అని అడిగారు. గొంగట్లో అన్నం తింటున్నామని తెలుసు, బొచ్చు ఏరకూడదని కూడా తెలుసు అని ఆయన అన్నారు. అందరూ భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు, ఒక్కరి పేరైనా తాను చెప్పానా అని వంశీ అడిగారు. రాజేంద్ర ప్రసాద్ పెద్దవాడు, తాను మాల వేసుకున్నా కాబట్టి సారీ చెబుతున్నానని వంశీ అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలోనే నాపై కేసులు
కేసులకు భయపడి వెళ్లిపోతున్నాడని తనను అన్నారని, రాజకీయాల్లోకి రాక ముందే తనపై కేసులున్నాయని, రాజకీయాల్లోకి వచ్చాక పోయాయని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తనపై రెండు కేసులు పెట్టారని ఆయన అన్నారు. తానేమైనా ఓటుకు నోటు కేసులో ఉన్నానని అని వంశీ ప్రశ్నించారు. తానేమైనా చార్లెస్ శోభరాజునా అని అడిగారు. తనను వ్యక్తిత్వం లేనివాడిగా, చదువూసంధ్యలు లేనివాడిగా, మత విశ్వాసం లేనివాడిగా, జులాయి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.
మీలాగా నేను బంగారు, వెండి స్పూన్లతో పుట్టలేదని, మీతో పోటీకి నేను తూగగలనా అని అడిగారు. ఎస్వీ రంగారావు వంటి పర్సనాలిటీ, ఎన్టీఆర్ లాంటి వాచకం తనకు ఉందా అని అడిగారు. ఆముక్తమాల్యదను మీరు ఊపి చెప్పేయగలరని అన్నారు. భారతం, రామాయణం, చెగువేరా, మాక్సిం గోర్కీ వంటివారిని మీరు చదివినవాళ్లని, మీరంతా పండితులు, అపార మేధస్సు కలిగివారు, సాహిత్య ప్రవీణులు, స్తితప్రజ్ఞులు అని ఆయన అన్నారు.
అభద్రతా భావానికి గురి కావద్దని ఆయన టీడీపీ నేతలనుద్దేశించి అన్నారు. కేశినేని నాని వద్ద జీతం తీసుకున్నావని చెప్పానా, నా వద్ద డబ్బులు తీసుకున్నావని చెప్పాని, వాళ్ల లాగా నాకు భాష రాదాయె, ఏం చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణలో ఆస్తి చూపించండి...
జగన్ చేతిలో తాను పావునయ్యానని అంటున్నారని, తనకు జగన్ తో గతంలోనే పరిచయం ఉందని, పరిటాల రవితో కూడా పరిచయం ఉందని, వైఎస్ తనకు సాయం చేసినా రాజకీయంగా తాను ఆయన వద్దకు వెళ్లలేదని వంశీ చెప్పారు. వైఎస్ తాను దొంగచాటుగా కలువలేదని ఆయన అన్నారు. తన ఆస్తి ఇబ్బందుల్లో పడిందని మీ మీడియాలోనే వేశారు, తెలంగాణలో ఆస్తి ఉందని నిరూపించండి, రాజీనామా చేస్తా అని అన్నారు.
కేసులపై చెప్పడానికి తాను జేడీ లక్ష్మినారాయణను కానని ఆయన అన్నారు. తన ఒక్కడివే వీడియోలున్నాయా, 1975లో ఇందిరా గాంధీ వద్ద బీ ఫారం తీసుకున్నప్పుడు చంద్రబాబు వీడియోలు లేవా, వార్తాపత్రికల్లో రాలేదా అని అడిగారు.
జూనియర్ ఎన్టీఆర్ ను, పవన్ కల్యాణ్ ను తిప్పినప్పుడు వాళ్లు మొహాలకు రంగులేసుకునేవాళ్లని తెలుసు కదా, తాము అడిగామా అని వంశీ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను తెవాలన్నప్పుడు అడిగామా అని అన్నారు. బొమ్మరిల్లులో ప్రకాశ్ రాజ్ లాగా వ్యవహరిస్తే ఎలా అని అడిగారు. ఎన్టీఆర్ మిమ్మల్ని కూడా సస్పెండ్ చేశారని తాను అనలేదని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తాను సస్పెన్షన్ లో ఉండగానే చంద్రబాబు పిలిచి విజయవాడ పార్లమెంటు సీటు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
లోకేష్ కు జీన్స్ ప్రాబ్లమా....
ఏలినవారు, ప్రభువులు, దొరవారు, మైసూరు మహారాజులు మీరు నన్ను తయారు చేశారు సరే.. మీ పుత్రరత్నాన్ని ఎందుకు తయారు చేయలేకపోయారు.. జీన్స్ ప్రాబ్లమా.. డిఎన్ఎ ప్రాబ్లమా అని వంశీ చంద్రబాబును అడిగారు. 200 మందికి టికెట్లు ఇచ్చారు. వారందరినీ తయారు చేయలేదా, తనను ఒక్కడినే తయారు చేశారా ఆయన అన్నారు. వారేమైనా స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచారా, జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నా, సమైక్యాంధ్ర పోరాటంలో పాల్గొన్నారా, అలా వచ్చారా, మదర్ థెరిసా మాదిరిగా సేవలు చేసి వచ్చారా అని అడిగారు. న్యాయసూత్రాలు తనకు ఒక్కడికే వర్తిస్తాయా, మీకు వర్తించవా అని అడిగారు.