
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్మకు మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడగలేదని సత్యకుమార్ కామెంట్ చేయడాన్ని షేకావత్ తప్పుపట్టారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైసీపీని అడిగినట్టుగా కేంద్ర మంత్రి షేకావత్ స్పష్టం చేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ నేతలు పాల్గొన్నారని గుర్తుచేశారు. సత్యకుమార్ మాటలు ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. ఇక, ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు సీఎం జగన్‌ను అడిగారని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వెల్లడించిన సంగతి తెలిసిందే.
అసలు సత్యకుమార్ ఏం అన్నారంటే..
విజయవాడలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సెప్టెంబర్ 25 నుంచి పాదయాత్ర చేపట్టాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలా..? లేదా జోన్ల వారీగా విభజించాలా అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉందని పేర్కొన్నారు. అభివృద్ది గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు, వైసీపీకి లేదని విమర్శించారు.
వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అయితే వైసీపీ ప్లీనరీలో మాత్రం ఎంతో గొప్పగా అభివృద్ది చేస్తున్నట్టుగా చెప్పారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు ఖర్చు చేస్తున్న డబ్బులో 60 నుంచి 90 శాతం కేంద్రం నుంచే వస్తుందని చెప్పారు. సీఎం జగన్ తన స్వస్థలం పులివెందుల నియోజకవర్గం పర్యటనలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేయడం చూస్తుంటే.. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న విరక్తి స్పష్టంగా కనిపిస్తోందని సత్య కుమార్ అన్నారు. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటెయ్యాలని బీజేపీ ఎప్పుడూ వైసీపీని అడగలేదన్నారు.