కాపు, ఓబీసీ రిజర్వేషన్‌.. ఏపీ సర్కార్ తీర్మానంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Mar 23, 2022, 4:39 PM IST
Highlights

కాపు, ఓబీసీ రిజర్వేషన్స్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అన్నారు. ఓబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో కాపు (kapu reservations) , ఓబీసీ రిజర్వేషన్లకు (obc reservations) సంబంధించి కేంద్ర హోంశాఖ (union home ministry) సంచలన ప్రకటన చేసింది. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హోంశాఖ వెల్లడించింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (gvl narasimha rao) అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రం రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పింది. కాపు, ఓబీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో లేదని వెల్లడించింది. ఓబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. కాపులకు రాష్ట్ర ప్రభుత్వమే విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వొచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీలు కాపులను మోసం చేశాయని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో వుందని తప్పుదోవ పట్టిస్తున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో ఆంధ్రప్రదేశ్ లోని కాపులకు ఐదు శాతం కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆ తీర్మానం ప్రతిని పంపించారు. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. దాని ద్వారా ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని తన వేపు తిప్పుకోవాలనే చంద్రబాబు వ్యూహం కూడా బెడిసికొట్టింది. 

ఈ నేపథ్యంలో ఆగస్టు 13, 2019న ప్రధాని నరేంద్రమోడీకి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 2.12.2017న కాపులకు బి. సి రిజర్వేషన్ ‘ఎఫ్’ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లును ఆమోదించాల్సిందిగా ముద్రగడ లేఖలో కోరారు.

ఆ లేఖలో ఇలా రాశారు... ‘‘బ్రిటిష్ వారి రాజపత్రం నెం. 67/1915 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మా జాతి (బలిజ, తెలగ, ఒంటరి, కాపు) బి సి రిజర్వేషన్ అనుభవించేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు 1956లో రిజర్వేషన్ తొలగించడం, అలా తొలగించిన రిజర్వేషన్లను అప్పటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు 1961లో జీఓ నెం. 3250 ద్వారా పునరుద్ధరించడం, ఆఖరిగా మరొక ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1964లో ఈ రిజర్వేషన్ రద్దు చేయడం జరిగిందని దస్త్రాలు చెబుతున్నాయని పెద్దల మాట. మా జాతి వారు గతంలో బి. సి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన వారు చాలా మంది ఉన్నారండి. 

అప్పటి నుంచి ఎన్నో పార్టీలు వారు పొగొట్టుకున్న మా రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇవ్వడం మా జాతిని ఓటు బ్యాంకుగా వాడుకుని, ఓట్లు వేయించుకుని, అధికారంలోకి రాగానే మోసం చేస్తూ మొహం చాటేయడం జరుగుతానే ఉందండి. 02.12.2017న మా జాతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీ.సీ రిజర్వేషన్ ‘ఎఫ్’ కేటగిరీలో 5 శాతం కేటాయిస్తూ తీర్మానం చేసి గౌరవ గవర్నర్ గారి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి బిల్లు నెం. 33/2017 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపియున్నారండి. దయ చేసి తమరు మా జాతి యందు పెద్ద మనస్సు చేసుకుని పోగొట్టుకున్న బి.సి(ఎఫ్) రిజర్వేషన్ ఫైలును ఆమోదింది మా జాతిలో ఉన్న పేద వారి జీవితాలలో వెలుతురును ఇప్పించమని కోరి ప్రార్ధించుచున్నానని’’ మోడీని లేఖలో కోరారు. 

click me!