జగన్ కు షాక్: అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం

By Arun Kumar PFirst Published Mar 2, 2022, 5:16 PM IST
Highlights

ఏపీ రాజధాని విషయంలో జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వైసిపి మూడు రాజధానుల నిర్ణయాన్ని కాదని అమరావతినే రాష్ట్ర రాజధానిగా గుర్తించిన కేంద్రం ఈ మేరకే బడ్జెట్ లో నిధులు కేటాయించింది. 

అమరావతి: ఏపీ రాజధాని (ap capital issue) విషయంలో వివాదం కొనసాగుతున్న సమయంలో జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల (three capitals) నిర్ణయాన్ని పట్టించుకోకుండా అమరావతి (amaravati)నే ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా గుర్తించింది. ఈ మేరకు అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ 2022-23 బడ్జెట్‍లో కేటాయింపులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం (ap reorganisation act) ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది కేంద్రం. అయితే ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే బడ్జెట్‍లో ప్రొవిజన్ పెట్టింది కేంద్రం. దీంతో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏళ్లుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతులు, మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Latest Videos

కేంద్ర బడ్జెట్‍లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలోని సచివాలయం (ap secretariat), ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధులు కేటాయించారు. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు అంచనా వ్యయంగా  కేంద్రం పేర్కొంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ.1,126 కోట్లుగా అంచనా వేసింది. 

ఇప్పటికే ఈ మేరకు GPOA కి భూసేకరణ కోసం రూ.6.69 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొని 2020-21, 2021-22 బడ్జెట్‍లో మొత్తం రూ.4.48 కోట్లు కేంద్రం ఖర్చుచేసింది. ఉద్యోగుల నివాస గృహాలకు అవసరమైన భూసేకరణకు 2021-22లో రూ.21 కోట్లు అంచనా వేసి ఇప్పటికే రూ.18.3 కోట్లు ఖర్చు చేసింది కేంద్రం. అలాగే 300 ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.200 కోట్లు అంచనా వ్యయంగా నిర్ధారించిన కేంద్ర ప్రభుత్వం. 

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) ఏపీలో పర్యటించిన సమయంలో రాష్ట్ర బిజెపి నాయకులకు అమరావతి ఉద్యమానికి మద్దతివ్వాల్సిందిగా రాష్ట్ర బిజెపి నాయకులను హితబోద చేసారు. అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులను అండగా నిలవాలంటూ పరోక్షంగా జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని రాష్ట్ర బిజెపి శ్రేణులకు మార్గనిర్దేశం చేసారు. అమిత్ షాతో సమావేశం తర్వాత రాష్ట్ర బిజెపి వ్యవహారంలో కూడా మార్పు వచ్చింది. 

అప్పటివరకు అమరావతి ఉద్యమాన్ని పట్టించుకోని ఏపీ బిజెపి నాయకత్వం అమిత్ షా పర్యటన తర్వాత పూర్తిగా ఉద్యమానికి దగ్గరయ్యారు. రాజధాని రైతుల పాదయాత్ర (farmers padayatra)కు కూడా బిజెపి సంఘీభావం తెలిపింది. అమరావతికి బీజేపీ ప్రత్యేక మద్దతు ఇస్తున్నదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. రైతుల పాదయాత్రలో బిజెపి నాయకులు సోము వీర్రాజు (somu veerraju), పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. రైతులకు అండగా నిలుస్తామని మాట్లాడారు.  

ఇలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నాయకులతో సమావేశమై అమరావతి ఉద్యమానికి మద్దతివ్వాలని ఆదేశించడంతోనే కేంద్రం ఎటువైపు వుందో బయటపడింది. తాజాగా అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ నిధులు కేటాయించడంతో స్పష్టంగా కేంద్రం వైసిపి సర్కార్ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా వుందని అర్థమవుతోంది.

click me!