
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం నాడు భారతదేశంలోని 20 విశ్వవిద్యాలయాలను నకిలీవిగా ప్రకటించింది. ఈ సంస్థలకు విద్యార్థులకు ఎలాంటి డిగ్రీలు మంజూరు చేయడానికి అధికారం లేదని పేర్కొంది. ‘‘యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. అటువంటి విశ్వవిద్యాలయాలు అందించే డిగ్రీలు ఉన్నత విద్య లేదా ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబడవు లేదా చెల్లుబాటు కావు. ఈ విశ్వవిద్యాలయాలకు ఏదైనా డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఉండదు’’ అని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విశ్వవిద్యాలయాలలో అత్యధికంగా ఢిల్లీలో 8 ఉన్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. గుంటూరులోని జిల్లా కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి కాగా.. మరొకటి విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. ఇక, క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీకి అడ్రస్.. 7వ లేన్, కాకుమానువారితోటో, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522002, మరొక అడ్రస్ నెం. 301, గ్రేస్ విల్లా ఆప్ట్స్, 7/5, శ్రీనగర్, గుంటూరు. ఇక, బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా అడ్రస్.. హౌస్ నెంబర్. 49-35-26, ఎన్జీవోస్ కాలనీ, విశాఖపట్నం
ఈ విధంగా నకిలీ యూనివర్సిటీల వివరాలను ప్రకటించడం ద్వారా.. గుర్తింపు లేని, మోసపూరిత సంస్థల నుండి విద్యను అభ్యసించే ఉచ్చులో పడకుండా విద్యార్థులను రక్షించడం యూజీసీ ప్రధాన లక్ష్యం. విశ్వవిద్యాలయాల్లో నమోదుకు ముందు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాటి అక్రిడిటేషన్ స్థితిని ధృవీకరించడం చాలా ముఖ్యం.
యూజీసీ విడుదల చేసిన నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా..
1. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (ఢిల్లీ)
2. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ (దర్యాగంజ్) (ఢిల్లీ)
3. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ (ఢిల్లీ)
4. వొకేషనల్ యూనివర్సిటీ (ఢిల్లీ)
5. ఏడీఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ (ఢిల్లీ)
6. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ (ఢిల్లీ)
7. విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ (ఢిల్లీ)
8. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఢిల్లీ)
9. గాంధీ హిందీ విద్యాపీఠ్ (ఉత్తరప్రదేశ్)
10. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (ఉత్తరప్రదేశ్)
11. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఉత్తరప్రదేశ్)
12. భారతీయ శిక్షా పరిషత్ (ఉత్తరప్రదేశ్)
13. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (పశ్చిమ బెంగాల్)
14. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ (పశ్చిమ బెంగాల్)
15. బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక)
16. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ (కేరళ)
17. రాజా అరబిక్ యూనివర్సిటీ (మహారాష్ట్ర)
18. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్ఛేరి)
19. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్)
20. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా (ఆంధ్రప్రదేశ్)