వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి పూజ చేస్తామంటూ వచ్చి....

By Nagaraju penumalaFirst Published May 1, 2019, 4:59 PM IST
Highlights


ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను టార్గెట్ చేసుకున్న ఆ కేటుగాళ్లు ఆయన నివాసం ఉంటున్న వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామం చేరుకున్నారు. తాము సహదేవుడు, కుమార్ బాబు అని పరిచయం చేసుకున్నారు. 
 

ప్రకాశం: మోసానికి కాదేది అనర్హం అన్న చందంగా తయారయ్యారు కేటుగాళ్లు. ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని రకరకాలుగా మోసాలు చేస్తూ పబ్బం గడుకుంటున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో కొందరు కేటుగాళ్లు భక్తిని ఆసరాగా చేసుకుంటున్నారు. 

కొందరు బాబాలుగా అవతారమెత్తి ప్రజలను బురిడీ కొట్టిస్తుంటే మరికొందరు నేరుగా ఇంటికి వచ్చి పూజలు చేస్తామని చెప్పి లక్షలకు లక్షలు గుంజేవారు మరికొందరు. అమాయక ప్రజలను భక్తి పేరుతో నమ్మించి ఆపై వంచించి పరారవుతున్నారు కొందరు కేటుగాళ్లు. 

అమాయక ప్రజలను నమ్మించి సొమ్ము చేసుకుంటే తక్కువ వస్తుందని భావించారో ఏమో లేక ఒకేసారి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న అనుకున్నారో కానీ ఏకంగా ఓ ఎమ్మెల్యేను బురిడీ కొట్టిద్దామని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు మోసగాళ్లు. 

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను టార్గెట్ చేసుకున్న ఆ కేటుగాళ్లు ఆయన నివాసం ఉంటున్న వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామం చేరుకున్నారు. తాము సహదేవుడు, కుమార్ బాబు అని పరిచయం చేసుకున్నారు. 

కుమార్ బాబు ఎమ్మెల్యే ఆమంచి ఇంట్లో పెద్దవాళ్లను కలిసి పూజలు చేయించుకుంటే మంచిదని తన దగ్గర కోయజాతికి చెందిన దొర ఉన్నాడని ఆయన ఏ పూజ చేసినా ఫలిస్తుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పూజేకదా అని భావించిన ఆమంచి కుటుంబ సభ్యులు అందుకు సరే అన్నారు. 

దీంతో ఆ కేటుగాళ్లు పూజకు కావాల్సిన సామాగ్రి కొంత రాశారు. అందులో కొన్ని తమ వద్ద ఉన్నాయని చెప్పి వారి వద్ద నుంచి కొంత నగదు తీసుకున్నారు. అయితే మధ్యలో ఓ కండీషన్ పెట్టారు. తాము పూజ చేసినందుకు, తాము వినియోగించిన పూజా ద్రవ్యాలకు మెుత్తం రూ.12.50 లక్షలు అవుతాయని చెప్పారు. 

దీంతో అక్కడ ఉన్నవారంతా కంగుతిన్నారు. ఇదేదో మోసంలా ఉందని గ్రహించారు. ఇంతలో ఎమ్మెల్యే ఆమంచి ఇంటికి రావడంతో వ్యవహారంపై ఆరా తీశారు. ఇరువురు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోపు సహదేవుడు నెమ్మదిగా జరుకున్నాడు. 

కుమార్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిందితులపై ఎలాంటి కేసులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. 

click me!