నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్: ప్రియుడే కారణం

By telugu teamFirst Published Mar 30, 2021, 12:49 PM IST
Highlights

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థిని మాధురి ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు ప్రియుడి వేధింపుల కారణంగానే మాధురి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

విజయవాడ: కృష్ణా జిల్లాలో నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థిని ముల్లి మాధురి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. మాధురి ప్రియుడి వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. మాధురి ప్రియుడు దాసరి వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కాకినాడకు చెందిన దాసరి వినయ్,మ మాధురికి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అయితే, గత రెండు నెలలుగా వారి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. మరొకరితో సన్నిహితంగా ఉంటూ తనను దూరం పెడుతోందని మాధురిపై వినయ్ అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను నిత్యం వేధిస్తూ వచ్చాడు. 

నాలుగు రోజుల క్రితం కూడా ఇరువురి మధ్య ఫోన్ లో సంభాషణ జరిగింది. తాను ఎవరితోనూ మాట్లాడకపోయినా తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, తాను మరణిస్తే తన విలువ ఏమిటో తెలుస్తుందని మాధురి మనస్తాపానికి గురైంది. దాంతో క్షణికావేశంతో మాధురి ఆత్మహత్య  చేసుకుంది. 

నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ముల్లి మాధురి (20) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెను కాకినాడ గాంధీ నగర్ కు చెందిన గోవింద్ కూతురిగా గుర్తించారు. సెలవులు కావడంతో విద్యార్థులు హాస్టల్లోనే ఉంటున్నారు. భోజనం సమయంలో మిగతా విద్యార్థులంతా బయటకు వెళ్లగా మాధురి గదిలో ఉండిపోయింది. అందరూ వెళ్లిపోగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

click me!