తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ వెబ్‌సైట్‌లో రీఫండ్ ట్రాకర్, 5 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు

By Siva KodatiFirst Published Aug 4, 2023, 5:18 PM IST
Highlights

తిరుమలలో గదులు పొందిన భక్తులకు రీఫండ్ సమాచారం కోసం ట్రాకర్ సదుపాయాన్ని తీసుకొస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.  రీఫండ్ కాని పక్షంలోనే కాల్ సెంటర్లను సంప్రదించాలని ధర్మారెడ్డి సూచించారు.

భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో గదులు పొందిన భక్తులకు రీఫండ్ సమాచారం కోసం ట్రాకర్ సదుపాయాన్ని తీసుకొస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన ధర్మారెడ్డి భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ క్రమంలోనే గదుల రీఫండ్ సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయడంపై వివరించారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాషన్ డిపాజిట్ మొత్తాన్ని రీఫండ్ చేస్తున్నామని ఈవో వెల్లడించారు. అదే క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన వారికి 3 నుంచి 5 రోజుల్లో వారి అకౌంట్లలో జమ చేస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు. ఈ విషయం తెలుసుకోకుండా కొందరు భక్తులు కాల్ సెంటర్లకు ఫోన్లు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

భక్తులు వారి బ్యాంక్ ఖాతాలను పరిశీలించుకుని, అప్పటికీ రీఫండ్ కాని పక్షంలోనే కాల్ సెంటర్లను సంప్రదించాలని ధర్మారెడ్డి సూచించారు. కొందరు నింధనల ప్రకారం గదులు ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్ కోడ్ సబ్‌మిట్ చేయకపోవడం, ఫోటో సరిపోలకపోవడం వంటి కారణాలతో రీఫండ్ జరగడం లేదని ఈవో వెల్లడించారు. 
 

click me!