టీటీడీ ప్రయోగం విజయవంతం: ఇకపై విద్యార్ధులతోనే హుండీ లెక్కింపు

By Siva KodatiFirst Published Aug 27, 2019, 10:40 AM IST
Highlights

తిరుమల శ్రీవారి హుండీని విద్యార్థులతో లెక్కించాలన్న టీటీడీ ప్రయోగం విజయవంతమైంది. సాధారణంగా కానుకల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది... అయితే విద్యార్ధులతో లెక్కింపు ప్రక్రియ మాత్రం నిన్న మధ్యాహ్నం 2.30కే పూర్తయ్యింది. దీంతో ఇక నుంచి విద్యార్ధుల చేతే కానుకలు లెక్కించే యోచనలో ఉంది టీటీడీ

తిరుమల శ్రీవారి హుండీని విద్యార్థులతో లెక్కించాలన్న టీటీడీ ప్రయోగం విజయవంతమైంది. సాధారణంగా కానుకల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది... అయితే విద్యార్ధులతో లెక్కింపు ప్రక్రియ మాత్రం నిన్న మధ్యాహ్నం 2.30కే పూర్తయ్యింది.

దీంతో ఇక నుంచి విద్యార్ధుల చేతే కానుకలు లెక్కించే యోచనలో ఉంది టీటీడీ. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు లెక్కించే ప్రక్రియ టీటీడీ అధికారులను ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే.

ముందు నుంచి కూడా హుండీ లెక్కింపు ప్రక్రియ టీటీడీ ఉద్యోగుల  చేతే నిర్వహించేవారు. అయితే ఆ తర్వాత ఉద్యోగులు ఇందుకు ససేమిరా అనడంతో శ్రీవారి సేవకుల సేవలను టీటీడీ వినియోగించుకునేది.

అయినప్పటికీ కానుకల నిల్వలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో... తిరుమల తిరుపతి దేవస్థానం తలలు పట్టుకుంది. ఈ క్రమంలో టీటీడీ విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధుల చేత ఈ కానుకలు లెక్కించాలని అధికారులు సోమవారం ప్రయోగం చేశారు.

దీనిలో భాగంగా ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన విద్యార్ధులు శ్రీవారి హుండీలు లెక్కించారు. విద్యార్ధుల రాకతో రెండున్నర గంటల ముందుగానే లెక్కింపు ప్రక్రియ పూర్తవ్వడంతో.. ఇకపై విద్యార్ధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది. 

click me!