బడ్జెట్‌లో ఒక్క శాతం తిరుపతి అభివృద్దికి కేటాయింపు: టీటీడీ పాలకవర్గం కీలక నిర్ణయాలు

By narsimha lode  |  First Published Oct 9, 2023, 6:22 PM IST

టీటీడీ పాలకవర్గంలో  పలు కీలక నిర్ణయాలను  తీసుకున్నారు.  పాలకవర్గం నిర్ణయాలను టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి  మీడియాకు వివరించారు. 


తిరుమల :  తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో అనునిత్యం   శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం నిర్వ‌హించాల‌ని టీటీడీ  ట్రస్టు బోర్డు నిర్ణయం తీసుకుంది.టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్యక్ష‌త‌న సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను  టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారంనాడు మీడియాకు వివరించారు. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందూ భ‌క్తులు త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ య‌జ్ఞం నిర్వ‌హ‌ణ‌కు చెల్లించాల్సిన రుసుమును త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తామని టీటీడీ చైర్మెన్ చెప్పారు. 

Latest Videos

undefined

టీటీడీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కింద విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, 
ఎఫ్‌ఎంఎస్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుండి రూ.17 వేలకు పైగా పెంచేందుకు పాలకవర్గం ఆమోదించిందని  కరుణాకర్ రెడ్డి తెలిపారు. 

 శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల వేతనాలలో ఇకనుంచి ప్రతి సంవత్సరం 3 శాతం వేతనం పెంచాలని  ట్రస్టు బోర్డు నిర్ణయం తీసుకుందని  టీటీడీ బోర్డు చైర్మెన్ చెప్పారు.ఈ నిర్ణయంతో దాదాపు 6,600 మంది ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. 

 టీటీడీలో సొసైటీల ద్వారా పనిచేస్తూ  కార్పొరేషన్‌లోకి మారిన ఉద్యోగస్తులకు వారి పనిని గుర్తిస్తూ ప్రతి రెండేళ్లకు గత సేవలకు మూడు శాతం ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించినట్టుగా  భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.ఈ పథకాన్ని  2023 అక్టోబరు నుండి అమలుపరుస్తామన్నారు. 

 కార్పొరేషన్‌ లో ఉద్యోగస్తులు  మరణిస్తే  రూ.2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని  టీటీడీ చైర్మెన్ చెప్పారు. ఈఎస్‌ఐ వర్తించని శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌ వర్తింపచేసేందుకు ఆమోదం లభించిందని  ఆయన తెలిపారు.ఈ హెల్త్‌ స్కీమ్‌ టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలల ద్వారా ఆ ఉద్యోగస్తులకు ఆరోగ్యపరమైన చికిత్సను అందజేయడం జరుగుతుందన్నారు. దీంతో దాదాపు 1500 మంది ఇఎస్‌ఐ వర్తించని ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుందని చైర్మెన్ వివరించారు. 

 అన్న‌మాచార్య సంకీర్త‌న‌ల‌కు విశేష ప్రాచుర్యం క‌ల్పించిన టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించాల‌ని కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని నిర్ణ‌యించినట్టుగా  కరుణాకర్ రెడ్డి తెలిపారు.న 

  తిరుమ‌ల‌లో వేలాది మంది సామాన్య భక్తులు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై సరైన వసతులు లేని తాత్కాలిక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారన్నారు.భక్తుల సౌకర్యార్థం రూ.18 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, ఫుడ్‌ కౌంటర్లు, టాయ్‌లెట్లు నిర్మించనున్నారు. అదే విధంగా నారాయణగిరి విశ్రాంతి గృహం సర్కిల్‌, ఆళ్వార్‌ ట్యాంకు రోడ్డు సర్కిల్‌ వద్ద రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపినట్టుగా  టీటీడీ చైర్మెన్ తెలిపారు.

 తిరుమల మొదటి ఘాట్‌ రోడ్‌లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం  నుండి మోకాలిమెట్టు వరకు రూ.2.81 కోట్లతో నడకదారి షెల్టర్లు నిర్మాణానికి టెండర్లకు  పాలకవర్గం ఆమోదం తెలిపిందన్నారు. యాత్రికులకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో తిరుమలలో ఎపి టూరిజం సంస్థ ఒక క్యాంటీన్‌ నిర్వహిస్తోంది. అదేవిధంగా అన్నమయ్య భవనం, నారాయణగిరి క్యాంటీన్లలో భక్తులకు భోజనం తక్కువ ధరకే ఇవ్వాలని గతంలోనే నిర్ణయించామని కరుణాకర్ రెడ్డి చెప్పారు. 

 ఇందులోభాగంగా రూ.2.93 కోట్లతో నారాయణగిరి క్యాంటీన్‌లో మూడో అంతస్తు నిర్మాణం,ఇతర అభివృద్ధి పనులు చేయడానికి టెండరుకు ఆమోదం తెలిపినట్టుగా  కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలలో 63 ఏళ్ల క్రితం నిర్మించిన గాయత్రీ సదన్‌, శ్రీవారి కుటీర్‌, టిబిసి-53, టిబిసి-64 తదితర 13 విశ్రాంతి గృహాలను కాటేజి డొనేషన్‌ స్కీమ్‌ కింద పునర్నిర్మాణం చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకుందన్నారు. టీటీడీకి చెందిన ఆల‌యాల‌తోపాటు టీటీడీకి సంస్థ‌లు, వ‌స‌తి స‌ముదాయాల్లో  పారిశుద్ధ్యాన్ని మెరుగుప‌ర్చాలని నిర్ణయం తీసుకున్నారు. 

ప్రతి సంవత్సరం టీటీడీ బడ్జెట్‌లో ఒక శాతం తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని  టీటీడీ చైర్మెన్ తెలిపారు. అదేవిధంగా హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్డు సామర్థ్యం సరిపోనందున ఆకాశగంగ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రూ.40 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపింది బోర్డు. 

టీటీడీలోని అన్ని ఆలయాలు, గోపురాల పటిష్టతను పరిశీలిస్తామని టీటీడీ చైర్మెన్ చెప్పారు.  కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులు చేసి మరలా భావితరాల వారికి ఆలయాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో చెర్లపల్లి నుండి శ్రీనివాసమంగాపురం శ్రీవారిమెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 2010వ సంవత్సరంలో రోడ్డు నిర్మించినట్టు చెప్పారు.

టీటీడీ పాఠశాలల్లో చదువుతున్న 3,259 మంది విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు 2023-24 విద్యా సంవత్సరం నుండి టీటీడీ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోందన్నారు.టీటీడీ క‌ల్యాణ మండ‌పాల్లో వివాహాలు జ‌రిపే స‌మ‌యంలో డిజె పాటలు కాకుండా భ‌క్తిగీతాల‌తో మాత్ర‌మే సంగీత విభావ‌రి నిర్వ‌హించుకోవాల‌ని నిబంధ‌న విధించిన విషయాన్ని టీటీడీ చైర్మెన్ తెలిపారు. 

అలిపిరిలో ప్రస్తుతం 130 వాహనాలను పార్క్‌ చేసేందుకు 2.47 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉందన్నారు.యాత్రికుల సంఖ్య పెరుగుతున్నందున మరో మూడు షెడ్లు నిర్మాణానికి మరో 11.34 ఎకరాలు అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ చైర్మెన్ తెలిపారు.  ఈ స‌మావేశంలో టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి క‌రికాల‌వ‌ల‌వ‌న్‌, క‌మిష‌న‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, జెఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం,బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు.
 

click me!