
తిరుమలలో అన్యమత ప్రచారం జరిగే ప్రసక్తే లేదన్నారు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు రమణ దీక్షితులు.
తిరుమల, తిరుపతి దేవస్ధానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడంపై ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు.
అనంతరం రమణ దీక్షితులు మాట్లాడుతూ.. సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని చెప్పారు. ఇటీవల దానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, సీఎం జగన్ దీనిని పునరుద్ధరించారని వెల్లడించారు.
దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలకు ఆటంకం లేకుండా కొనసాగించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు రమణ దీక్షితులు తెలిపారు. వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణను సీఎం వైఎస్ జగన్ రద్దు చేశారని ఆయన వెల్లడించారు.
సీఎం వైఎస్ జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని ఆకాంక్షించారు. చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివేనని రమణ దీక్షితులు అభివర్ణించారు. ఎవరు రాజకీయాల్లో ఉన్నా విమర్శ చేస్తూనే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.