సరైన కారణాలు చెబితే ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు సవరించేందుకు సిద్దమని ఏపీ ప్రబుత్వం తెలిపింది. 20 ఏళ్లుగా ఫీజులు నోటిఫై చేయలేదన్నారు. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులను వసూలు చేశాయని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఛైర్మెన్ కాంతారావు చెప్పారు.
అమరావతి: సరైన కారణాలు చెబితే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు సవరించేందుకు సిద్దమని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఛైర్మెన్ కాంతారావు చెప్పారు.గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులను ఇబ్బందిపెడితే తమకు వెబ్‌పైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన కోరారు.
80 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలు తాము ఖరారు చేసిన ఫీజుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడడం లేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పరిశీలనకు వెళ్తే ఎందుకు అడ్డుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. విద్యా సంస్థలను లాభదాయక వనరుగా చూడొద్దని ఆయన కోరారు.
కోవిడ్ సమయంలో 30 శాతం ఫీజు తగ్గించాలని 57 జీవోను ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. మేనేజ్‌మెంట్లు సుప్రీంకోర్టు ఆర్డర్ ను ఫాలో కావాలని సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో ఫీజులు నిర్ధారించామన్నారు. రాష్ట్రంలో 20 ఏళ్లుగా స్కూల్ ఫీజులు నోటిఫై చేయడం లేదని ఆయన చెప్పారు. ఫీజులు నోటిఫై చేయని కారణంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టమొచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన చెప్పారు.