ఆర్జీవీ వ్యాఖ్యలపై దుమారం.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు.. అరెస్ట్ చేయాలని డిమాండ్..

By Sumanth KanukulaFirst Published Mar 16, 2023, 5:38 PM IST
Highlights

సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్‌పై పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన కామెంట్స్‌పై పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన ‘అకాడమిక్‌ ఎగ్జిబిషన్‌ 2023’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌గోపాల్ వర్మ.. అక్కడ స్టూడెంట్స్‌తో ముచ్చటించే సమయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తన లైఫ్ స్టయిల్‌ను ఫాలో అవండి విద్యార్థులకు బోధించిన ఆర్జీవీ అందరిని షాక్కు గురిచేశాడు. నచ్చిన విధంగా ఉండాలని చెప్పాడు. నచ్చింది తిని, కావాల్సినంత తాగి, ఇష్టం వచ్చినప్పుడు  శృంగారం చేయాలన్నట్లుగా వర్మ మాట్లాడడం అక్కడున్న ప్రొఫెసర్లను ఇబ్బంది పెట్టింది. 

అంతేకాకుండా తను తన కోసమే బ్రతుకుతానని.. తను చనిపోయిన మరుక్షణం ఈ ప్రపంచం ఏమైనా తనకు అనవసరం లేదని అన్నారు. అలాగే తనకు పైన స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశిలపై నమ్మకం లేదని.. అందుకే అన్ని తాను ఇక్కడే వెతుక్కుంటానని చెప్పుకొచ్చారు. అలాగే తనను యూనివర్సిటీ వీసీ ఫిలాసఫర్ అనడంపై స్పందిస్తూ.. ‘‘నేను పిచ్చి నా కొడుకును’’అని అన్నారు.

Also Read: వర్మ క్వాలిఫికేషన్‌ ఏంటో తెలుసా?.. 37ఏళ్ల తర్వాత పట్టా పొందిన ఆర్జీవీ..

 అయితే ఈ వ్యాఖ్యలపై టీఎన్‌ఎస్ఎఫ్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ వ్యాఖ్యలకు నిరసనగా నాగార్జున యూనివర్సిటీ ముందు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్జీవీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీఎన్‌ఎస్‌ఎఫ్.. విద్యార్థులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడని మండిపడ్డారు. ఆర్జీవీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.. విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 

మరోవైపు ఆర్జీవీ వ్యాఖ్యలపై ఏబీవీపీ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్జీవీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఆర్జీవీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ను సస్పెండ్ చేయాలని కోరారు.

click me!