తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) పరిపాలన భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ పరిపాలన భవనం ముందు భారీగా మోహరించిన పోలీసులు.. కార్మికుల నిరసనలను (protests) అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) పరిపాలన భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో విలీనం చేయాలని కోరుతూ ఎఫ్‌ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన (protest ) చేపట్టిన సంగతి తెలిసిందే. వారు గత 14 రోజులుగా ఈ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు శుక్రవారం టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో టీటీడీ పరిపాలన భవనం ముందు భారీగా మోహరించిన పోలీసులు..నిరసనలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు పలువురు ఎఫ్‌ఎంఎస్ కార్మికులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో టైంస్కేల్ ఇస్తామన్న హమీని ముఖ్యమంత్రి హోదాలో జగన్ నెరవేర్చాలని కోరుతున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీకి భిన్నంగా టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవోలు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
undefined
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతిలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో కాంట్రాక్టు కార్మికులు ఆయనను కలిసి కష్టాలను చెప్పుకొన్నారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన తెలుపుతున్నా పట్టించుకోలేదని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే సీఎం జగన్ నుంచి సానుకూల స్పందన కనిపించిన.. టైంస్కేల్ హామీ అమలు అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని కార్మికులు చెబుతున్నారు.
ఈ నిరసనల్లో భాగంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన టైంస్కేల్ హామీ అమలు అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 2019లో జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీలో పనిచేస్తున్న 14వేల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఈక్వల్ మినిమమ్ టైంస్కేల్ వర్తింప చేస్తామని తీర్మానం కూడా చేశారని అన్నారు. ఈ తీర్మానాన్ని టీటీడీ యాజమాన్యం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.