
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న తిరుపతి ఆధ్యాత్మికతకు , ప్రశాంత వాతావరణానికి నిలయం. నిత్యం దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మక శోభతో పాటు రాజకీయంగానూ ఎప్పుడూ వార్తల్లో వుంటుంది తిరుపతి. తమిళనాడుకు అత్యంత చేరువలో వుంటూ రాయలసీమ పరిధిలోకి వచ్చే తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రభావం వుంటుంది. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన తిరుపతి ఉద్ధండులైన రాజకీయ నాయకులను దేశానికి అందించింది.
తిరుపతి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఎన్టీఆర్, చిరుల రాజకీయ ప్రస్థానం ఇక్కడే :
వెండితెర వేల్పులైన నందమూరి తారక రామారావు, చిరంజీవిలను చట్టసభల్లోకి పంపింది. ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు తమ పొలిటికల్ ఎంట్రీ కోసం తిరుపతిని కేంద్రంగా ఎంచుకోవడం విశేషం. తిరుమలతో పాటు శ్రీకాళహస్తి దేవాలయాలు, సూళ్లూరుపేటలోని షార్ అంతరిక్ష కేంద్రం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు వున్న తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంపై ఎప్పుడూ ఆసక్తి వుంటుంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం . చెరకు, వేరుశెనగ, మామిడిని ఎక్కువగా సాగు చేస్తారు. ఉద్యోగ, వ్యాపార వర్గాల జనాభా కూడా ఎక్కువగానే వుంటుంది.
1952లో ఏర్పడిన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ కంచుకోట. హస్తం పార్టీ 12 సార్లు ఇక్కడి నుంచి గెలిచింది. వైసీపీ మూడుసార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ భూస్థాపితం కాగా.. ఆ ప్లేస్‌లోకి వైసీపీ చేరింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన రెండు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలో జగన్ పార్టీ ఘన విజయాలు సాధించింది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సర్వేపల్లి, గూడురు, సూళ్లురుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,50,453 మంది. వీరిలో పురుషులు 8,39,621 మంది.. మహిళలు 8,10,577 మంది.
తిరుపతి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. వైసీపీదే ఆధిపత్యం :
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 13,13,515 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. 79.59 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావు 7,22,877 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీకి 4,94,501 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 2,28,376 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అయితే బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఆనివార్యమైంది. వైసీపీ తరపున పోటీ చేసిన మద్దిల గురుమూర్తికి 6,26,108 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీకి 3,54,516 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి కే.రత్నప్రభకు 57,080 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీ దాదాపు 2,71,592 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
తొలి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న తిరుపతిలో ఇప్పుడు వైసీపీ పట్టు పెంచుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2021 లోక్‌సభ ఎన్నికలోనూ ఆ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది. 2024లోనూ మరోసారి గెలిచి నెల్లూరును నిలబెట్టుకోవాలని జగన్ భావిస్తున్నారు. అయితే సీఎం తీసుకున్న నిర్ణయాలతో తిరుపతి వైసీపీలో గందరగోళం నెలకొంది.
తొలుత సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని సత్యవేడు నుంచి అసెంబ్లీకి పంపాలని జగన్ భావించారు. అలాగే తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ప్రకటించారు. కానీ ఆదిమూలం తాను ఎంపీగా పోటీ చేయలేనని తేల్చిచెప్పడంతో పాటు టీడీపీ నేతలను కలిసి ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో జగన్ వ్యూహం మార్చారు. గురుమూర్తిని తిరిగి తిరుపతి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా నియమించి.. సత్యవేడు అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా నూకతోటి రాజేష్‌ను నియమించారు.
తిరుపతి ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. నలభై ఏళ్లుగా గెలవని టీడీపీ :
ఇక.. టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో గెలిచి దాదాపు 40 ఏళ్లు గడుస్తోంది. పార్టీ ఆవిర్భావ సమయంలో 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున చింతా మోహన్ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 1999లో గెలిచే అవకాశం వున్నప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్ధికి తిరుపతిని కేటాయించారు చంద్రబాబు. తాజాగా జనసేనతో పొత్తు నేపథ్యంలో తిరుపతి విషయంలో తెలుగుదేశం మల్లగుల్లాలు పడుతోంది . టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ పేరు వినిపిస్తోంది. ఒకవేళ పొత్తులోకి బీజేపీ వస్తే.. కర్ణాటక మాజీ సీఎం కేఎస్ రత్నప్రభ కుటుంబంలో ఒకరికి సీటు దక్కే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది.