తిరుపతిలో టీడీపీ వ్యూహకర్త మకాం: ఎవరీ రాబిన్ శర్మ?

By telugu teamFirst Published Dec 21, 2020, 7:49 AM IST
Highlights

తిరుపతి లోకసభ ఉప ఎన్నికను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఇప్పటికే తిరుపతి చేరుకుని వ్యూహరచన చేస్తున్నారు.

తిరుపతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నికను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అన్ని పార్టీల కన్నా ముందే తిరుపతి అభ్యర్థిని ఆయన ప్రకటించారు. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ  గత కొద్ది రోజులుగా తిరుపతిలోనే మకాం వేశారు. పార్టీ నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. 

తిరుపతి ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ఆయన ఇక్కడే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మ నిజానికి వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ జట్టులో ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి షోటైమ్ కన్సల్టింగ్ పేరుతో సొంత సంస్థను పెట్టుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ గత కొద్ది రోజులుగా పనిచేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, సంస్థాగతంగా బలోపేతం అవుతూ ముందుకు సాగే విధంగా రాబిన్ శర్మ టీడీపీ కోసం వ్యూహరచన చేస్తున్నారు. 

తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధిస్తే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని ఆయన అనుకుంటున్నారు. దీంతో ఆయన తిరుపతి ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మృతితో తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. గురుమూర్తిని తమ పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్ కూడా ఇప్పటికే ప్రకటించారు. తిరుపతిలో పోటీ చేసి తెలంగాణలో మాదిరిగా సత్తా చాటాలని మరో వైపు బిజెపి ఉవ్విళ్లూరుతోంది. 

click me!