కేసుల ఉద్థృతి: కంటైన్మెంట్ జోన్‌లోకి తిరుమల.. శ్రీవారి దర్శనంపై భక్తుల్లో ఆందోళన

By Siva KodatiFirst Published Jul 9, 2020, 3:56 PM IST
Highlights

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కొలువైయున్న తిరుమల కొండలు కంటైన్మెంట్ జోన్‌లోకి వెళ్లాయి. ఈ మేరకు అధికారులు తిరుమలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత తెరచుకున్న ఆధ్యాత్మిక కేంద్రాలపై వైరస్ మరోసారి విరుచుకుపడటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కొలువైయున్న తిరుమల కొండలు కంటైన్మెంట్ జోన్‌లోకి వెళ్లాయి. ఈ మేరకు అధికారులు తిరుమలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ కోవిడ్ 19 నిబంధనల ప్రకారం.. కంటైన్మెంట్ జోన్‌లలోకి వెళ్లడానికి, అందులో నుంచి బయటకు రావడానికి వీలు లేదు. దీనిని బట్టి తిరుమలలో దర్శనం మళ్లీ నిలిచిపోతుందా అనే ఆందోళన భక్తుల్లో నెలకొంది.

Also Read:ఏపీలో 24 వేలకు చేరువలో కరోనా కేసులు: మొత్తం 277 మంది మృతి

తిరుపతిలోని 48 వార్డులు, తిరుమల నగర్, శెట్టిపల్లి, మంగళంను కూడా అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటి వరకు తిరుమలలో 84 మందికి కోవిడ్ సోకినట్లుగా తేలింది.

ఏపీఎస్పీ బెటాలియన్‌లో సుమారు 50 మందికి పాజిటివ్‌గా తేలింది. సెక్యూరిటీ సిబ్బందిలో కూడా కొందరికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. వైరస్ కారణంగా సుమారు రెండు నెలలకు పైగా శ్రీవారి ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే.

అనంతరం కేంద్రం సడలింపులు ఇవ్వడంతో జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించారు. 8,9 తేదీలో టీటీడీ సిబ్బందికి.. 10న తిరుపతివాసులకు దర్శన భాగ్యం కలిగింది.

11 నుంచి సాధారణ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు 17 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకిందని బోర్డు ప్రకటించింది. అలాగే 50 ఏళ్లకు పైబడిన వారిని విధులకు రావొద్దని ఆదేశించింది. 
 

click me!