రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ రద్దు.. కారణమిదే..

By Sumanth KanukulaFirst Published Jan 5, 2023, 10:13 AM IST
Highlights

తిరుమల శ్రీవారి  ఆలయంలో శుక్రవారం గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. పౌర్ణమి సందర్భంగా నిర్వహించే శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమల శ్రీవారి  ఆలయంలో శుక్రవారం గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. పౌర్ణమి సందర్భంగా నిర్వహించే శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ప్రతినెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గురుడ  సేవ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం శ్రీవారి అధ్యయనోత్సవాలు జరుగుతున్నందున గరుడ సేవ నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 

ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.  కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. తిరుమల శ్రీవారి భక్తులను జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్టుగా టీటీడీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్లను తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో టీటీడీ జారీ చేస్తోంది. అయితే ఇకపై నాలుగు కేంద్రాల్లో మాత్రమే టీటీడీ ఈ టోకెన్లు జారీ చేయనుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్నట్టుగా టీటీడీ తెలిపింది. 

ఇదిలా ఉంటే బుధవారం తిరుమల శ్రీవారిని 61,112 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 18 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చింది. 
 

click me!