
తిరుపతి : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జూ పార్కుకు వెళ్లిన ఓ చిన్నారి మృత్యువాత పడ్డాడు. వేసవి సెలవుల్లో సరదాగా చిన్నారులను జూ పార్కు తీసుకువెళ్లిన ఆ తల్లిదండ్రుల పాలిట శోకమే మిగిలింది. ఆ కుటుంబాన్ని విషాదం ముంచెత్తింది. బ్యాటరీ వాహనం ఆ చిన్నారి పాలుట యమశకటంగా మారింది. తల్లి కళ్ళముందే ఏకైక కుమారుడు కన్నుమూశాడు. బ్యాటరీ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ తల్లికి కడుపుకోత మిగిలింది.
ఈ ఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా ముత్యాలరెడ్డిపల్లి ఎస్ఐ వినోద్ కుమార్ ఈ మేరకు వివరాలు తెలియజేశారు. తిరుపతి జిల్లా గాజుల మండలం సమీపంలోని మొలగమూడికి చెందిన మనోజ్ కుమార్, సుష్మ దంపతులు. మనోజ్ కుమార్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తూ బెంగళూరులో ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆయన భార్య సుష్మ పిల్లలతో కలిసి తిరుపతిలో ఉంటుంది. ఈ ముగ్గురిలో ఇద్దరు ఆడపిల్లలు. కాగా ఒకరు అబ్బాయి.
మెరుగైన చికిత్స: వైఎస్ వివేకా వాచ్ మెన్ రంగయ్యను హైద్రాబాద్‌కు తరలించే అవకాశం
బుధవారం నాడు సుష్మ తన ముగ్గురు పిల్లలు, అన్న కొడుకును తీసుకొని తిరుపతిలోని జూ పార్కు కు వెళ్లింది. ఈ సమయంలో దుకాణంలో ఏదో కొనుక్కోవడం కోసం కొడుకు ప్రణవ్ నారాయణ (3) చేయి పట్టుకుని తీసుకు వెళుతుంది. ఇంతలో ఓ బ్యాటరీ వాహనం అటుగా వేగంగా దూసుకు వచ్చింది. అది ప్రణవ్ ను గట్టిగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఉన్న ప్రదేశం నుంచి ఎగిరి కాస్త దూరంలో పడ్డాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర రక్తస్రావం అయింది.
ఇది చూసినవారు వెంటనే అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు. కాదా చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. సరదా కోసం జూ పార్కు వెళ్లి విగత జీవిగా తిరిగి వచ్చిన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు అవుతున్నారు. నిందితుడిని మునిరాజాగా గుర్తించారు. అతను రెండు నెలల కిందటే కాంట్రాక్టు వర్కర్ గా విధుల్లో చేరినట్లుగా తెలిపారు. అతను వాహనాన్ని వేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అతనిమీద కేసు నమోదు చేస్తున్నట్లు తిరుపతి ఎస్సై తెలిపారు.