నెల్లూరులో ఘోరం... రైలు కిందపడి మహిళ, ఇద్దరు పురుషులు దుర్మరణం

By Arun Kumar PFirst Published Jan 22, 2023, 9:08 AM IST
Highlights

రైలు కిందపడి ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతిచెందిన విషాద ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో చోటుచేసుకుంది. వీరిది ఆత్మహత్యా? ప్రమాదమాా? అన్నది తెలియాల్సి వుంది. 

నెల్లూరు : రైలు కిందపడి ఓ మహిళ, ఇద్దరు పురుషులు మృతిచెందిన దుర్ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను కాపాడే ప్రయత్నంలోనే పురుషులిద్దరూ ప్రమాదానికి గురయినట్లు... ఇలా ముగ్గురూ రైలు ఢీకొని దుర్మరణం చెందిన ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు. 

వివరాల్లోకి వెళితే... గూడూరు నుండి విజయవాడకు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ నెల్లూరులో మీదుగా వెళుతుండగా దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఓ మహిళ, ఇద్దరు పురుషులను రైలు ఢీకొట్టింది. దీంతో మహిళ మృతదేహం బ్రిడ్జి కింద పడిపోగా పురుషుల మృతదేహాలు పట్టాలపై పడిపోయాయి. మృతులు ముగ్గురూ మధ్య వయసులో వున్నవారే.  

పట్టాలపై వున్న మహిళలు కాపాడేందుకు ప్రయత్నించే ఇద్దరు పురుషులు కూడా ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పొలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాద స్థలంలో మృతిచెందిన వారి బ్యాగులు లభించాయి. ఓ బ్యాగ్ లో విజయవాడ కార్పోరేషన్ కు చెందిన వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ తెన్నేటి సరస్వతీరావు పేరుతో ఐడీ కార్డును గుర్తించారు. దీంతో మృతుల్లో ఒకరు సరస్వతీరావు అయివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 ప్రమాదస్థలిలో టీటీడీ లాకర్ అలాట్‌మెంట్ స్లిప్పు లభించగా అందులో బి. రమేశ్ నాయక్ అని ఉంది. దీంతో మృతుల్లో రమేష్ నాయుడు కూడా వున్నట్లు అనుమాసిస్తున్నారు. ఇక మరో బ్యాగ్ లో ఫోన్ నెంబర్ వుండటంతో దానికి ఫోన్ చేయగా ఎవరూ స్పందించడం లేదు. ఆ బ్యాగ్ మృతిచెందిన మహిళది అయివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

మృతులంతా విజయవాడకు వెళుతూ ప్రమాదానికి గురయినట్లు తెలుస్తోంది. అయితే మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పురుషులు కాపాడే ప్రయత్నం చేసారా? లేదంటే ప్రమాదవశాత్తు ముగ్గురు రైలుపట్టాలపై ప్రమాదానికి గురయ్యారా అన్నది తెలియాల్సి వుంది. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!