శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు... కడప యాక్సిడెంట్ లో ముగ్గురు మహిళల దుర్మరణం

By Arun Kumar PFirst Published Jan 20, 2023, 9:42 AM IST
Highlights

కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకుని స్వస్థలానికి తిరిగివెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కడపలో జరిగిన యాక్సిడెంట్ లో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. 

కడప : తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వస్థలానికి తిరిగివెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తిరుమల నుండి ప్రొద్దుటూరుకు వెళుతుండగా భక్తులు ప్రయాణిస్తున్న వాహనం  అర్థరాత్రి రోడ్డుప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందగా మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీకి చెందిన ఓ కుటుంబం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్ళింది. 15 మంది కుటుంబసభ్యులు ఓ టెంపో వాహనంలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని గురువారం రాత్రి తిరుగుపయనం అయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్నటెంపో అర్ధరాత్రి 2గంటల సమయంలో కడప జిల్లాలోని చాపాడు వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో డ్రైవర్ త్వరగా గమ్యాన్ని చేరుకోవాలని నిద్రమత్తులోనే డ్రైవింగ్ చేయడంతో ఘోర ప్రమాదం జరిగింది.  

వేగంగా వెళుతున్న టెంపో అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో టెంపోలోని అనూష(30), ఓబులమ్మ(40), రామలమ్మ(48) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కాపాడి ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

రోడ్డుప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించి వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. 
 
 

click me!